Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (తెలుగు)

సంగ్రహ ఆంధ్ర

లేఖారూపమున వచనరచనలు ప్రచురితములగుచుండెడివి. చిన్నయసూరి ప్రభృతు లిందు వ్రాయుచుండువారు. ఈ యుగమున లేఖా వాఙ్మయముకూడ వచనరచనకు చక్కని యభివృద్ధిని కలిగించినది. ఈ వాఙ్మయమునకు మూలపురుషుడనతగినవాడు చార్ల్స్‌ఫిలిప్సు బ్రౌను అనునాతడు. బ్రౌను లేఖలు పది సంపుటములుగా నున్నవి. అందు నాటి సాంఘిక, సారస్వత పరిస్థితులు చక్కగా ప్రతిఫలించినవి. ఈ లేఖలలో వ్యావహారిక, గ్రాంథిక రచన లున్నవి. ఈ కాలమున చారిత్రిక, శాస్త్రీయ గ్రంథములు కూడ కొన్ని రచితములైనవి. కర్నల్ మెకంజీగారికి మార్గదర్శకుడైన కావలి వేంకటబొర్రయ్య వ్రాసిన కాంచీపుర మాహాత్మ్యము (1802), సరస్వతీబాయిచే వ్రాయబడి కావలి వేంకటరామస్వామిచే ఆంగ్లమున కనువదింపబడిన పాకశాస్త్రము (1836), అల్లాడి రామచంద్రశాస్త్రిగారి సిద్ధాంత శిరోమణి (1837), వైద్యనాథ సిద్ధాంతిగారి భూఖగోళ దీపిక (1843) ప్రభృతములు ప్రధానములైనవి,

చిన్నయసూరి యుగము : క్రీ. శ. 1857 వ సంవత్సరము రాజకీయముగానే కాక సాంస్కృతికముగా కూడ భారతదేశమునకు ముఖ్యమైనది. మనదేశమున ఈ సంవత్సరముననే విశ్వవిద్యాలయ స్థాపన ప్రారంభమైనది. 1857వ సంవత్సరమున మద్రాసు విశ్వవిద్యాలయము స్థాపించుటయు, అందు తెలుగుభాష పఠనీయముగ ఏర్పాటు చేయుటయు జరిగినవి. దక్షిణదేశమున రచితములైన వచన గ్రంథము లీనాటికి ప్రకాశములు కాలేదు. అందుచే గ్రాంథికమును, సలక్షణము నగు వచన రచన నాటి విశ్వవిద్యాలయ విద్యార్థుల కావశ్యకమైనది. ఇట్టి రచనకు ప్రథమమున పూనుకొన్నవాడు చిన్నయసూరి. 1856 లో నవీన గ్రాంథిక వచన రచనమునకు శ్రీకారప్రాయమైన నీతిచంద్రికను రచించి ముద్రింపించినాడు. చిన్నయసూరి గ్రాంథిక భాషాభిమాని యగుటచేతను, అతనికి విద్యాశాఖలో తగిన గౌరవ ముండుటచేతను, తన గ్రాంథికవచనములు పాఠ్యములుగా నుండుటకు అవకాశము లభించినది. చిన్నయసూరి పంచ తంత్ర హితోపదేశ కథలను గ్రహించి, మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము అను నాలుగు భాగములుగ “నీతి చంద్రిక "యను గ్రంథమును రచింపబూనెను. కాని ఈతడు రచించినవి మిత్రలాభము, మిత్రభేదము అను భాగములు మాత్రమే. నీతిచంద్రిక పేరుతో నున్న ఈ గ్రంథము సలక్షణ గ్రాంథికమున నున్నది. విశ్వ విద్యాలయమున పాఠ్య గ్రంథముగా నుపయుక్తమైనది. నీతి చంద్రికా రచనా ప్రభావముచే నాటి కాలమున గ్రాంథిక భాషకు ప్రాబల్యము దేశమున నధికమైనది. పాఠ్య ప్రణాళికలు, పత్రికలు, వ్యాఖ్యలు, లేఖలు, ఉపన్యాసములు గ్రాంథికభాషనే ప్రోత్సహించినవి. చిన్నయసూరి తరువాత రాజధాని కళాశాలలో ప్రధాన పండితులైన కొక్కొండ వెంకటరత్నము పంతులుగారు, సూరిగారు ప్రారంభించిన గ్రాంథిక భాషా మహోద్యమమును స్థిరీకరించిరి. 1866 లో సూరి విడచిన సంధివిగ్రహతంత్రములను అట్టి శైలిలోనే రచించి, 1872 లో విగ్రహమును ముద్రింపించిరి. అది విశ్వవిద్యాలయమున అదే సంవత్సరము పఠనీయమైనది. 1871 లో వీరు “ఆంధ్ర భాషా సంజీవని" యను పత్రికను ప్రారంభించి ఇరువది సం. రములు నడపిరి . ఇది గ్రాంథికభాషా ప్రచారమునకే వినియోగింపబడినది. వెంకటరత్నము పంతులుగారు 1877 లో ప్రిన్స్ ఆఫ్ వేల్సు హిందూస్థాన దర్శనము అను గ్రాంథిక వచనగ్రంథమును రచించిరి. ఇదియు పాఠ్యగ్రంథముగా నియమితమైనది.

ఒకవైపు విశ్వవిద్యాలయము స్థాపితమై గ్రాంథిక రచన జరుగుచుండగా వేరొకవైపున ప్రజాసామాన్యము కొరకు సులభశైలిలో వచన కథారచనలు వెలువడినవి. ఇట్టివాటిలో పరమానందగురువుల కథలు (1861), తడకమళ్ళ వెంకటకృష్ణారావు రచించిన అరేబియన్ నైట్సు కథలు (1862), కంబుధరచరిత్ర (1866), తెలుగు వెలుగు ముగుద కథ (1879), ఎర్రమిల్లి మల్లికార్జునుడు వ్రాసిన చారుదర్వీషు కథలు (1881), చదలువాడ సీతారామశాస్త్రిగారి దక్కను పూర్వకథలు ముఖ్యములైనవి. ఇవికాక నీతిచంద్రికకన్న కొలది తేలికరచనలు పాఠ్యగ్రంథముల వంటివి ప్రచురితములైనవి. ఎనమచింతల సంజీవ రాయశాస్త్రిగారి దశకుమారచరిత్ర (1886), దాసు శ్రీరాములుగారి అభినవ గద్యప్రబంధము (1893) పేర్కొనదగినవి. ఈకాలమున కొన్ని పౌరాణికములుకూడ వెలసినవి. కార్మంచి సుబ్బరాయలునాయని వారి దశావ

288