Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖగోళశాస్త్రము (ప్రాచీన భారతీయుల కృషి)

చార్యుడు భూభ్రమణవాదమును ప్రతిపాదించిన పౌరుష సిద్ధాంతులలో ప్రథముడు. “అనులోమగతి శ్శాస్థః పశ్యత్య చలనం విలోమగంయద్వత్ అచలాని భానితద్వత్ సమపశ్చిమగాని లంకాయాం" అని చెప్పియున్నాడు. అనగా పడవమీద నుండువాడు అనులోమముగా వెళ్లుచు, కూలస్థమగు వృక్షాదికమును విలోమగతికలదానినిగా ఎట్లు చూచునో అట్లే పరిభ్రమించుచున్న భూమియందున్న మానవుడు అచలములగు నక్షత్రములను, సమపశ్చిమగతి కలవానినిగా చూచుచున్నాడు' అని భావము. ఇట్లు స్పష్టముగా భూభ్రమణమును ఆర్యభటాచార్యుడు ప్రతిపాదించి యున్నాడు. అర్వాచీనుడగు నొక వ్యాఖ్యాత దాని కపవ్యాఖ్యానము చేయుటచేత, మరియొకడు మూలములోనే భూభ్రమణమును ఖండించు మరియొక శ్లోకమును ప్రక్షేపించినాడు. భూమి భ్రమించుట లేదనియు, కోటాను కోట్ల నక్షత్రసంఘము లన్నియు మహాదేశగర్భములో ఇసుక రేణువువంటి మన భూమిచుట్టు తిరుగుచున్న వనుట యుక్తిసహముకాదు.

బ్రహ్మగుప్తాచార్యుడు మహామేధావి (క్రీ. శ. 678, 'కృతీ జయతి జిష్ణు జోగణితచక్ర చూడామణిః' అని భాస్కరు డాతనికి జోహారు చేసియున్నాడు. చక్రీయ చతుర్భుజ వైశాల్యసూత్రమును ప్రప్రథమమున చెప్పినవా డీతడని పాశ్చాత్యగణిత శాస్త్రజ్ఞు లీతని మేధనుగుర్తించిరి. (Vide Hobson's Trignometry) అంతియేకాదు - వర్గప్రకృతి యను పేరిట (Indeterminate Equations of the 2nd degree) అద్భుతముగ గణితాంశములను బ్రహ్మస్ఫుట సిద్ధాంతములో ప్రతిపాదించియున్నాడు. ఈ గణితమును తరువాత భాస్కరాచార్యుడు 'చక్రవాళ' మను పేరిట వివరించిన విషయము పాశ్చాత్యుల దృష్టి నాకర్షించి వారిని ముగ్ధులను చేసినది. వెగ్రాంజి యను పాశ్చాత్యపండితుడు 1787 లో తయారుచేసిన వ్యాసములో (Memoirs) ముఖ్యవిషయములు భాస్కరాచార్యుని చక్రవాళములో నున్నవి. (Vide Bhaskara's Bijaganita) దీనినిబట్టి భాస్కర బ్రహ్మగుప్తుల (క్రీ. శ 678) మేధానైశిత్యము గణితశాస్త్రజ్ఞులకు గోచరించగలదు. ముంజాలాచార్యుడు (క్రీ. శ. 936) అయన చలనమును సూక్ష్మముగా ప్రతిపాదించినవాడు. ఆకాశమునందు దృశ్యబిందువగు క్రాంతిపాతయొక్క సుసూక్ష్మమగు చలనమును గుర్తించుటయేగాక దాని యొక్క వార్షికగతిని సునిశితముగా ప్రతిపాదించుట సామాన్యవిషయము కాదని ఖగోళజ్ఞులకు గోచరించ గలదు. 'అయన చలనం యదుక్తం ముంజాలాద్వైస్స ఏవాయం' అని భాస్కరుడు ముంజాలాచార్యునికి జోహారు చేసియున్నాడు. శ్రీపత్యాచార్యుడు ముంజాలాచార్యునికి కొద్ది అర్వాచీనుడై, భాస్కరునికి పూర్వుడై సిద్ధాంత శేఖరమను ఒక ఉద్గ్రంథమును రచించియున్నాడు. అందు ప్రతిపాదింపబడిన ఒక అందమైన విషయమును భాస్కరుడు గ్రహించి పునరుద్ఘాటించియున్నాడు. అది యేది యనగా ప్రాచీసాధనము. అనగా తూర్పు బిందువు ఏది యను మీ మాంస. యజ్ఞ వేదికా నిర్మాణమందును, గృహ నిర్మాణమందును ప్రాచీ సాధనము చేయవలసియున్నది. గృహము సాక్షాత్ ప్రాచీ ప్రతీచీ దిశాముఖముగా గాని లేక సాక్షాదు దగ్ధక్షిణముఖముగా గాని నిర్మింపబడవలయును. లేనిచో గృహ యజమానికి నష్టము కలుగునని వాస్తుశాస్త్రములో చెప్పబడి యుండుట చేత నేటికిని పెక్కురు గృహ నిర్మాతలు ప్రాచీ సాధనమును సిద్ధాంతులచేత చేయించుకొనియే యిండ్లు కట్టుకొనుచున్నారు. సూర్యు డుదయించుదిక్కు తూర్పు కాదా ? దీనికింత మీమాంస యేల యని ప్రశ్నింప వచ్చును. 'శ్రవణ స్యోదయే ప్రాచీ కృత్తికాయాస్త ధోదయే చిత్రా స్వాత్యంతరే ప్రాచీ నప్రాచీ చంద్రసూర్యయోః' అని చెప్పబడినట్లు, సూర్యా చంద్రమసులు ఉదయించు దిక్కు సాక్షాత్ ప్రాచీకాదనియు, ఉత్తరాయణములో సూర్యుడు తూర్పు బిందువునకు ఉత్తరముగా ఉదయించు ననియు, దక్షిణాయనములో దక్షిణమున ఉదయించు ననియు, అందుచేత సూర్యాచంద్రమసులు ఉదయ బిందువును ప్రాచీబిందువుగా గ్రహింప కూడదనియు, కృత్తికా శ్రవణ నక్షత్రోదయ బిందువు సాక్షాత్ప్రాచీ బిందువుగ గ్రహించవచ్చుననియు ప్రాచీనులు తీర్మానించిరి. నేడిదియు సరియైనదికాదు. విషువచ్చలనముచేత కృత్తికా నక్షత్రోదయ బిందువు నేడు ప్రాచీ బిందువు కాదు. విషువద్బిందువు కృత్తికలలో నుండగా ప్రచారములోనికి వచ్చిన భావమిది. కావున ప్రాచీ బిందువు నెట్లు

173