Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రస్వరూప రచన - కంచెలు

సంగ్రహ ఆంధ్ర

పెక్కు అంశములను పర్యాలోచింపవలసి యున్నది. వీటిలో 'క్షేత్ర స్వరూపరచన-కంచె నిర్మాణము' ఒకటియై యున్నది. భారతదేశములో చెదురువాటుగ నున్న స్వల్ప పరిమాణపు భూఖండములపై వర్తమానకాలమున వ్యవసాయ కలాపములు కొనసాగుచున్నవి. ఈ చిన్న భూఖండములకు సవ్యమైన క్షేత్ర స్వరూపరచనము (farm layout) లేకుండుటచే, యంత్రపరికరములను వ్యవసాయ మందుపయోగించుట కష్ట మగుచున్నది. తత్కారణముచే వ్యవసాయోత్పత్తియందు శక్తి సామర్థ్యములు సన్నగిలుచున్నవి.

క్షేత్రస్వరూప రచన మనగానేమి ? అదెందులకు? : సరియగు పరిమాణమును, ఆకారమును, సంఖ్యా విభాగములును క్షేత్రమునకు కల్పించుటయు, ఉత్పాదన శక్తిని పెంచుటకై రహదారులను, వ్యవసాయ గృహ నిర్మాణములను రూపొందించుటయు క్షేత్రస్వరూప రచన మనబడును. సవ్యమైనట్టియు, సరసమైనట్టియు ఇట్టి క్షేత్ర స్వరూపరచనమును గావించుటకై కొన్ని సూత్రములను సామాన్యముగ అనుసరింపవలసియున్నది.

1. క్షేత్రమందు వ్యవసాయదారుని సామర్థ్యమునకు, ఆనుకూల్యమునకు అనువగురీతిగా కట్టడములను నిర్మించుటకై పథకము తయారుచేయుట.

2. పొదుపరితనమును దృష్టియం దుంచుకొని కట్టడములకు నిర్మాణ పథకము రచించుట.

3. వంతు (rotation) ప్రకారము పంటలు పండించు విధానమునకు అనువగు విధమున పొలముల సంఖ్యను, స్వరూప పరిమాణములను ఏర్పాటొనరించుట.

4. క్షేత్రస్వరూప రచనము ననుసరించి మంచినీటి పారుదలకు, మురుగునీటి పారుదలకు వసతు లేర్పరచుట.

5. వేర్వేరు క్షేత్రములను చేరుకొనుటకై వేర్వేరు మార్గములు నిర్మించుటకు పథకము తయా రొనరించుట.

సవ్యమైన క్షేత్రస్వరూప రచనమువలనను, క్షేత్రమందలి కట్టడములవలనను, ఈ క్రింది పెక్కు ప్రయోజనములు సిద్ధించును.

(అ) తరుణము ననుసరించి పంటలు పండించు పథకమును సక్రమముగ రూపొందించి, ఇతోధికముగ దానిని పర్యవేక్షించుటకు వీలగును.

(ఆ) కాలహరణములేకుండ, వ్యవసాయపరికరములను, కార్మికులను, వ్యవసాయోత్పత్తిని చేరవేయుట సుకర మగును.

(ఇ) నీటిని అధికముగ వృథాచేయక, పంటభూములకు ఎక్కువ సులభముగను, సమతూకముగను నీరు పారుదల యగునట్లు సౌకర్య మేర్పరచుట సాధ్యమగును.

(ఈ) పంటపొలము కోతకోసికొని పోకుండ కొంతమేరకు అదుపులో నుండగలదు.

క్షేత్రస్వరూపరచనమందు గమనింపదగిన అంశములు: వ్యావసాయిక విధానముపైనను, క్షేత్రముయొక్క భౌతిక పరిస్థితులపైనను, ఆధారపడి పొలములయొక్క సంఖ్యావివరణము, ఆకారము, పరిమాణము మున్నగు అంశములు క్షేత్రస్వరూపరచనమందు విచారింపబడవలసి యున్నది. విభజింపబడవలసిన పొలములయొక్క కనీస సంఖ్య పంటలసంఖ్యకును, సంపూర్ణముగ ఒకవంతు తిరిగి వచ్చుటకై పట్టు సంవత్సరముల సంఖ్యకును అనుగుణ్యముగ నుండవలయును. ఉదాహరణమునకు, మొదటి మూడు సంవత్సరముల వంతులో వరుసగా చెరకు - గోధుమ - ప్రత్తి; రెండవ మూడు సంవత్సరముల వంతులో వరుసగా వేరుసెనగ - ప్రత్తి - గోధుమ పంటలను పండించుటకు కనీసము సరియైన పరిమాణములు గల మూడు క్షేత్రములుగా భూమిని విభజించుట అవసరమగును.

భూమిని సమచతురస్రములకంటె దీర్ఘచతురస్రములుగ విభజించుటయే ఉచితము. కారణ మేమన. ఇట్లు విభజించుటవలన, పొలము దున్నుట సుకరమగును. దీర్ఘ చతురస్రఖండములందు తక్కువసంఖ్యలో తిరుగుళ్ళు (turns) అవసరమగును. దీనివలన కాలము, శ్రమయు వృథా యగుట తగ్గును. ఒక ఖండముయొక్క వెడల్పునకు దాని పొడవు రెండు రెట్లున్నచో, అట్టి పొలమందు వ్యవసాయము చేయుట వీలగునని భావింపబడు చున్నది.

క్షేత్రములకు సవ్యముగను, సుప్రమాణముగను రూప రచన గావింపబడినచో, వ్యావసాయక కలాపముయొక్క శక్తి సామర్థ్యములు అధికమగును. ఇంతియేకాక, వ్యవసాయ పరికరములు, యంత్రములు, పొలముయొక్క సాధారణ నేలమట్టము, నీటిపారుదల వనరులు మున్నగు

164