Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రపాయనము - మురుగుపారుదల

సంగ్రహ ఆంధ్ర

పంట భూములకు కాలువల మూలమున నీటిని పారుదల చేయుదురు. ఇవి మట్టి కాలువలగుటవలన, నీరు పొలములకు చేరెడి లోపుననే ఎక్కువ భాగమును భూమి పీల్చివేయును. కాగా పంట భూములకు సరఫరా అయ్యెడి నీరు నిరంతరము తగ్గుచునేయుండును. ఇసుక నేలలందు అధిక జలము వ్యర్థముగా భూమియందు ఇంకిపోగా, బంకమట్టి నేలలయందు ఇట్లు వ్యర్థమగు జలము అతిస్వల్పముగ మాత్రమే ఉండును. ఏటవాలుగాఉన్న ప్రాంతము కంటె, సమతలముగానున్న భూమిపైన పొడుగైన కాలువల త్రవ్వకము అవసరమగును. మట్టికాలువలలో ఒండు పేరుకొన్నను, లేక గడ్డి, గాదము పెరిగియున్నను, నీటి పారుదలకు ఆటంకము కలిగి పంటభూములకు నీరు సక్రమముగా సరఫరా కాజాలదు. అందువలన ఇట్టి కాలువలను తరచుగా పరిశుభ్రము చేయుచుండవలెను. ఇటిక, సిమెంటులతో నిర్మింపబడిన కాలువల వలన నీటి నష్టము చాలావరకు తగ్గును.

ఉపరితలక్షేత్రపాయనము : భూమియొక్క ఉపరితలము పైనను, భూమి అడుగుభాగమునుండి, పైరు పై భాగము నుండి పంటపొలములకు అనేక విధములుగా నీటిని సరఫరా చేయవచ్చును. ఉపరితలమున పొలములకు నీటి పారుదల సాగించు విధానమును 'ఉపరితలక్షేత్రపాయన’ (Surface irrigation) మందురు. దక్షిణ భారతదేశములో ఈ విధానము సర్వసామాన్యముగా అమలునందున్నది. ఈ విధానమునందు (1) ఫ్లడ్ ఇర్రిగేషన్, (2) బెడ్ ఇర్రిగేషన్, (8) ఫర్రో ఇర్రిగేషన్, (4) ట్రెంచ్ ఇర్రిగేషన్, (5) బేసిన్ ఇర్రిగేషన్ అను అనేక మార్గములు అవలంబింపబడుచున్నవి.

1. ఫ్లడ్ ఇర్రిగేషన్ : వరిపొలములలో నీటిని నిలువచేసి వరిమొక్కలను నాటి పెంచెదరు. చెఱకు, అరటి, పసుపువంటి పంటలుకూడా నీటిని నిలువచేయుట మూలముననే పండుచున్నవి. అవసరము తీరగా మిగిలిన నీరును వెలుపలికి తోడివేయుదురు.

2. బెడ్ ఇర్రిగేషన్: బావులనుండి నీటిని పొలములకు సరఫరా చేయువిధానము 'బెడ్ ఇర్రిగేషన్' అందురు. భూమిపైన చినచిన్న 'మడులు' (beds) ఏర్పాటుచేసి, ఆ మడులలో నీరు సమముగా నిలువయుండునట్లు చూచెదరు. ఇట్టి నీటి సరఫరా విధానము కాయగూరల తోటలలో ఎక్కువగా వాడుకయందున్నది. ఈ దిగువ ఉదహరింపబడిన పరిమాణములలో కాయగూరల మడులు ఏర్పాటు చేయబడును.

నీటిని అందజేయు సాధనము. అడుగులలో మడుల పరిమానము. చ. అడుగులలో మడుల వైశాల్యము
ఒక మోట నీరు 8 × 8 - 10 64 నుండి 80
రెండు మోటల నీరు 10 × 10 - 13 100 నుండి 130
ఎలిక్ట్రిక్ పంపు 15 × 15 - 20 225 నుండి 300

3. ఫర్రో ఇర్రిగేషన్ : భూమిని నాగలితో చాళ్లుగా తయారుచేసి, ఈ చాళ్ల ద్వారా నీటిని నెమ్మదిగా పారుదల చేయుదురు. చాళ్ల అడుగుభాగము క్రమముగా నాని, రెండుచాళ్ల నడుమనుండు మెరక భాగము గూడ చెమ్మగిలును. ఈ విధముగా నీరు కొంతవరకు పొదుపగును. భూమిమీదనున్న నీరు ఆవిరి యగుటకు గూడ తక్కువ అవకాశముండును. తడిగాలులు వీచెడి తరుణములో ఈ నాగటిచాళ్లు నీటి బోదెలుగా ఉపయోగించును. ఈ విధానమువలన, నిలువ నీటియందువలె పంటలు నష్ట పడవు. నాగటి చాళ్ళద్వారా నీరును పారుదలచేయు విధానము, విశాలభూములలో పండు ప్రత్తి, పుగాకు, మిర్చి, బంగాళాదుంప, ఉల్లి మొదలగు పంటలకు అనువుగా నుండగలదు. చెఱకుపంటలకు అవసరమయిన వెడల్పును లోతునుగల నాగటిచాళ్ళను తయారుచేసి వాటిద్వారా పుష్కలముగా నీటిని సరఫరా చేయుదురు. 10 మొదలు 30 అడుగుల దూరమునకు ఒక్కొక్క కాలువ చొప్పున తయారుచేసి, వీటినుండి నాగటిచాళ్ళలోనికి నీరు పారునట్లు ఏర్పాటు చేయుదురు. ఇంతకు పూర్వ ముదహరించినట్లు, సమతలమునందు దీర్ఘపరిమాణపు నాగటిచాళ్ళను, ఏటవాలు ప్రాంతమునందు పొట్టి నాగటిచాళ్ళను తయారుచేయుదురు.

4. ట్రెంచి ఇర్రిగేషను : పల్లపు భూములలో అరటి తోటలను పెంచుటకై అప్పుడప్పుడు ఫ్రెంచి ఇర్రిగేషన్ విధానము అవలంబింపబడును. అరటిమొక్కలను ఎటుచూచినను 6 నుండి 8 అడుగుల ఎడముగా ఒక్కొక్కటి చొప్పున నాటెదరు. అరటిచాళ్ళకు మధ్య నిలువుగను,

146