Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షీరసాగరము

ఎంతదూరముగ నున్నను, దూరమునుండి చూచువారికి అవి యన్నియు ఒకదానితో మరియొకటి పెనవేసికొని చెట్టునకును చెట్టునకును నడుమ దూరమే యున్నట్లు కాన్పింపదు. దూరమునుండి చూచువారికి ఒక గ్రామమున అన్నియు వృక్షములే యున్నట్లు కాన్పించును గాని ఇండ్లేమియును కానరావు. కాని తీరా దగ్గరకు వెళ్ళి చూతుముకదా, చెట్లు అక్కడక్కడ మాత్రమే యున్నట్లు కనపడును. ఈ క్షీరసాగరములోని నక్షత్రములును అట్లే.

బాగుగ పరీక్షించినచో, క్షీరసాగరమున చుక్కలు కొన్నికొన్ని చోట్ల సాంద్రముగనుండి గుత్తులుగా కన్పించును. ఇట్టి చుక్కలగుత్తులు ఈ క్షీరసాగరమున ఎన్నియో కలవు. వీటిలో అన్నిటికంటెను మనకు దగ్గరగా నున్నది. అశ్వతర మండలములోనిది. దాని దూరమైనను 18,000 కాంతి సంవత్సరములు. ఇక మిగిలినవాటి దూరమేమి చెప్పగలము? ఈ చుక్కలగుత్తుల దూరములను కనుగొనుటకు అవకాశము, వాటిలో 'సిఫాయిడ్స్' (Sephoids) తార లుండుటవలన కలిగినది. ఇట్టి చుక్కలగుత్తులు క్షీరసాగరమున అనంతముగ నున్నవి. ఒక్కొక్క గుచ్ఛమున కొన్నిలక్షల నక్షత్రములుండి, అన్నియుకలిసి ఒక కుటుంబముగా నున్నవి. ఈ చుక్కలన్నియు ఒకదానికి మరొకటి దగ్గరగానుండి, విడిపోకుండుటకు వాటి పరస్పర ఆకర్షణ శక్తియే కారణము. ఈ గుత్తులలోని నక్షత్రములు పరస్పరాకర్షణచే, సూర్యకుటుంబములోని గ్రహములు ఒక కేంద్రముచుట్టును పరిభ్రమించునట్లుగనే ఒక కేంద్రము చుట్టును పరిభ్రమించుచుండును. ఈ నక్షత్ర గుచ్ఛముల పరిభ్రమణకాలములు తెలిసినచో, వాటిలోని నక్షత్రముల సమిష్టి భారమును లెక్కకట్టవచ్చును. సూర్యుడు గూడ ఇట్టి నక్షత్రగుచ్ఛములలోని ఒక గుచ్ఛమునం దున్న నక్షత్రము మాత్రమే. అనగా మనము భూమిమీదినుండి కంటితో చూడగలిగిన నక్షత్రము లన్నియు కలిసి ఒక గుచ్ఛముగా ఏర్పడినవన్నమాట. ఈ గుచ్ఛములోని నక్షత్రములన్నియు ఒకే కేంద్రము చుట్టును పరిభ్రమించు చున్నవి. వీటితోపాటు సూర్యుడు గూడ ఈ నక్షత్ర గుచ్ఛము యొక్క కేంద్రము చుట్టును పరిభ్రమించు చున్నాడు. సూర్యపరిభ్రమణ వేగము క్షణమునకు 12 మైళ్ళు. ప్రస్తుతము సూర్య గమనదిశ వీణా (Lyra) మండలములోని బ్రహ్మనక్షత్రము (Vega) వైపున గలదు.

పై జెప్పిన నక్షత్ర గుచ్ఛములు కాక, క్షీరసాగరమున పెక్కు నభోలములు (Nebulae) గలవు. నభోలము లనగా ఇంకను నక్షత్ర రూపము ధరింపని పదార్థము . ఇవి పొగమబ్బువలె నుండి అతి కాంతివంతముగ నుండును. వీటిలో నుండియే నక్షత్రములు ఉద్భవించును. ఇట్టి రిక్కమబ్బు (Nebulae) వృత్రాసుర మండలములోని గొల్లకావడి' వద్ద నున్నది. ఇది దూరమునుండి చూచుటకు చాల చిన్నదిగా కన్పించినను, దాని దూరమును కనుగొని లెక్కకట్టి చూచినచో, అది చాల పెద్దగనే యుండును. దాని పొడవు ఇంచుమించు 15 కాంతి సంవత్సరములు; వెడల్పు 5 కాంతి సంవత్సరములు. ఇంత వైశాల్యము గల వస్తువును సూర్యునితో పోల్చి, 'సూర్యునికంటె ఇన్ని రెట్లు పెద్దది' అని చెప్పుట అసంభవము. ఈ ఒక్క నభోలము నుండియే ఎన్నియో లక్షల సూర్య నక్షత్రములు ఉద్భవింపవచ్చును. ఇది మనవద్దినుండి 600 కాంతి సంవత్సరముల దూరమున నున్నది. ఇది, ఇతర నభోలములతో పోల్చి చూచినచో, చాల కొద్ది దూరమనియే చెప్పవచ్చును. ఈ నభోలములలోని నక్షత్రపూర్వరూప వాయుపదార్థము యొక్క సాంద్రత చాల తక్కువ. ఇది, గాలి సాంద్రతలో ఒక కోటవ వంతుకంటె తక్కువగానే యున్నదని చెప్పవలయును. ఈ పదార్థ మంతయును స్వకీయాకర్షణచే ఒకచోట పోగై మున్ముందు నక్షత్రములుగ విడిపోవును.

క్షీరసాగరములో నక్షత్ర గుచ్ఛములు, నభోలములు, విడిచుక్కలు కాక, కొన్నిచోట్ల నల్లని మాసికలు కాన నగును. ఇట్టిది ఒకటి రాజహంస మండలమునుండి అశ్వతరమండలము (Centaurus) వరకు వ్యాపించియుండును. అనగా క్షీరసాగరము రాజహంసమండలమునొద్ద రెండుగ చీలి మరల అశ్వతర మండలముదగ్గర కలిసికొనును. ఈ నల్లని మాసికే 'ఛాయాపథము' అని వర్ణింపబడినది. ఇట్టిది యొకటి దక్షిణధ్రువప్రాంతమునొద్ద నున్నది. దీనిని 'బొగ్గుసంచి' (coal sack) అని యందురు ఇట్టి కాలమేఘములు ఇప్పటికి ఇంచుమించుగా 200 కనుగొన

143