Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షీరసాగరము

సంగ్రహ ఆంధ్ర

ఎక్కువగా వెదజల్లబడును. అట్లు వెదజల్లబడిన ఈ కిరణములను ఒక ఫిల్ముమీద పడునట్లు చేసినచో ఉన్మీలనము (develop) చేసిన తరువాత ఫిల్ముమీద నల్లని గీతలు కనబడును. ఈ గీతలసంఖ్య, స్వభావము ఆ పదార్థము మీద ఆధారపడియుండును. వేలిముద్రనుబట్టి ఒక మనుష్యుని గుర్తుపట్టునట్లు, ఈ గీతలనుబట్టి పదార్థములను గుర్తు పట్టవచ్చును. ఈ పద్ధతిని క్ష-కిరణ-పృథక్కరణము (X-ray analysis) అందురు. ఈ పద్ధతి చాల వాడుకలో నున్నది.

4 వ పటములో మెగ్నీషియం ఫ్లూరైడు (Magnesium Fluride) యొక్క చూర్ణచిత్రము (Powder Photograph) చూపబడినది.

చిత్రము - 36

పటము - 4 క్ష-కిరణ - పృథక్కరణము

కె. వి. కృ.


క్షీరసాగరము (Milky Way) :

ఆకాశమున క్షీరసాగరమును చూడనివారుండరు. ఉత్తరమునుండి దక్షిణమువరకు పెద్దకాలువవలె ప్రవహించు తెల్లనికాంతినే క్షీరసాగరమందురు. దీనినే పాలపుంత (Milky way) యనియు, 'కాశీ రామేశ్వరముల త్రోవ' యనియు గూడ వ్యవహరింతురు. దీనికి తూర్పుగను, పడమరగను పోయినకొలది చుక్కలు పల్చబడి, ఎక్కువ సంఖ్యలో కానరావు. మనకు కనిపించు చుక్కలలో నూటికి 90 వంతులు ఈ క్షీరసాగరమునకు సమీపమున నున్న వే. ఇది ఖగోళమునకు ఒక విధమగు వడ్డాణముగ నుండి దీనినుండి దూరముగా, అనగా, దీని ధ్రువ ప్రాంతమునకు పోయినకొలది, చుక్కల సంఖ్య తగ్గు చుండును.

మన పురాణములలోని క్షీరసాగర మధనము మొదలైన కథలన్నియు దీనికి సంబంధించినవే. కాని వాటిలోని ఖగోళశాస్త్ర విషయములను మనము మరచిపోయి, కేవలము వాటిని పురాణగాథలుగా మాత్రమే మననము చేయుచున్నాము.

పై జెప్పిన కాంతి ప్రవాహములో ఒక భాగమునకు 'ఆకాశగంగ' యని పేరు. ఈ ఆకాశగంగ మహావిష్ణు మండలము (Hercules) ప్రక్కనున్న గరుడమండలములో (Aquila) శ్రవణానక్షత్రము (Altair) వద్ద అనగా విష్ణుపాదము వద్ద ఉద్భవించి 'చదలేటి బంగారు జలరుహంబుల తూండ్లు భోజనంబులు' గా గల రాజహంస మండలము (cygnus) ద్వారా ప్రవహించి 'పచ్చరాచట్టు గమిరచ్చపట్టు' గా గల రంభా, ఊర్వశీ మొదలగు అప్సరోగణములకు విహార క్షేత్రమై, కల్పవృక్షమండలము (Camalo Paradalis) ప్రక్కగా సాగిపోవును. అదే ఆకాశగంగ దక్షిణమునకు సాగిపోయి, మృగవ్యాధరుద్ర నక్షత్రము (Syrius) వరకును వ్యాపించి శివ జటాజూటమున ధరింపబడుచున్నది. రెండవభాగమునకు క్షీరసాగరమని సామాన్యముగ వ్యవహరింతురు. ఈ క్షీరసాగరముననే శ్రీమహావిష్ణువు శయనించియున్నా డను మహావిష్ణు మండలము (Hercules) ఉన్నది. దిగువను మందరగిరి, వాసుకి మొదలగు నక్షత్రముల గుంపులుండి, క్షీరసాగర మథన కథను జ్ఞప్తికి తెచ్చుచుండును.

ఒక దూరదర్శిని యంత్రముతో పరిశీలించినచో, మనకు వెలుగు వెల్లువవలె కన్పించు నది అనేక నక్షత్రముల కాంతిసముదాయమే యని తెలియనగును. ఈ నక్షత్రములన్నియు ఒక్కచోట గుంపుగా నుండక ఒకదాని వెనుక నొకటి ఉండుటచే, అన్నిటి కాంతియు కలిసి ఒక గొప్ప కాంతి వెల్లువవలె కాన్పించును. ఈ క్షీరసాగరము ఒక బండిచక్రమువలె నుండును. ఈ చక్రమునకు పూటీల మీదను, పట్టామీదను అంతులేని నక్షత్రసముదాయముండి, ఆ నక్షత్రములలోనే ఒక నక్షత్రమువద్దనుండి చూచు మనకు ఇవి యన్నియు ఒకదాని వెనుక మరొకటుండి, ఆకాశము అను నల్లని తెరపై వెండిపొడి చల్లినట్లు గనపడును. అడవిలోని చెట్లు ఒక దానినుండి మరియొకటి

142