Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్ష-కిరణములు

చిత్రము - 35

పటము - 3 రాంట్ జెనోగ్రాం

ఉపయోగింపబడుచున్నవి. నౌకలు, వంతెనలు, ఆనకట్టలు నిర్మించుటలోను, లోహపరిశ్రమలోను, నైలాను మొదలగు వివిధరకముల వస్త్రపరిశ్రమలోను X-కిరణపరిశోధనము ఎంతో తోడ్పడుచున్నది. మన శరీరములోని ఎముకలను పరీక్షించునట్లే, ఒక లోహపు రేకులోని లోటుబాట్లను X-కిరణములవలన కనిపెట్టవచ్చును.

పదార్థములలోని అణువుల మార్పును కనుగొనుట : X-కిరణముల ఉపయోగములలో అన్నిటికంటె ముఖ్యమైనది పదార్థములలోని అణువులు కూర్పు (atomic structure) ను కనుగొనుట. మనము సూక్ష్మదర్శినితో వెలుగు కిరణతరంగములకంటె చిన్నవిగా నున్న వస్తువులను చూడలేము. అందుచే వెలుగుకిరణములు తరంగములకంటె చాల చిన్నవైన అణువులను పరీక్షించుటకు చాల తక్కువ పరిమాణముగల తరంగములు అవసరము. X-కిరణ తరంగముల పరిమాణము పదార్థములయొక్క అణువుల పరిమాణమునకు సమీపమున నుండుటవలన, X-కిరణములను ఉపయోగించి అణువులను పరీక్షించుట సాధ్యమైనది. ఈ విషయము 'లావే' అను జర్మను శాస్త్రవేత్త 1912 సం. లో కనుగొనెను. తరువాత బ్రాగ్ (Bragg) మొదలైన శాస్త్రజ్ఞుల కృషివలన X-కిరణములను ఉపయోగించి పదార్థములలోని అణువుల కూర్పును కనుగొనుపద్ధతి చాల అభివృద్ధియైనది. మొదట సామాన్యమైన వజ్రము, ఉప్పు మొదలగు పదార్థముల అణువుల కూర్పుతో ప్రారంభమై, ప్రస్తుతము కొన్నివందల పరమాణువులు గల అణువుల కూర్పును కనుగొనువరకు ఈ పద్ధతి అభివృద్ధియైనది. ఇటీవల ఫ్రెడరిక్ సాంగర్ (Frederic Sangar) అను శాస్త్రజ్ఞుడు విద్యుద్బంధనము (Insulin) లోని అణువుల కూర్పును సాధించెను.

ఒక పదార్థముయొక్క ధర్మములు వానిలోని అణువుల కూర్పుమీద ఆధారపడి యుండును. అందుచే పదార్థముల అణుకూర్పునకును వాని ధర్మములకును గల సంబంధమును కనుగొని, మనకు కావలసిన ధర్మములు గల పదార్థములను తయారుచేసికొనవచ్చును. ఈ విధముగ ఇటీవల ఆమెరికాలో వజ్రమును కూడ కోయగల బోరజాను అను పదార్థము తయారుచేయబడినది.

పదార్థములనుపరిశీలించుటకు అనేక X కిరణపద్దతులు వాడుకలో నున్నవి. వాటిలో చూర్ణపద్ధతి Powder Method) చాల ఉపయోగకరమైనది. పరిశీలించవలసిన పదార్థమును మెత్తని చూర్ణముగ చేసి X-కిరణ మార్గములో నుంచినచో X-కిరణములు కొన్ని దిశలలో

141