పుట:SamskrutaNayamulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
70

సంస్కృతన్యాయములు

లుండఁగా నిదివఱకు చూచియుండలేదు. మఱి, రాజుగారి బంధువు కావచ్చును. "రాజద్వారే శ్మశానేచ యస్తిష్ఠతి స బాంధవః- రాజద్వారమున శ్మశానమున నుండువాఁడు బంధువుఁడగును" (పంచతంత్రము) అని గదా పెద్దలనుడి. తప్పక రాజబంధువే కావచ్చును. అట్లవుచో, వీనికి చేతిలో వేత్రము (కఱ్ఱ) లేదే!" ఇట్లాతఁడు పలుపోకలు పోయెను. పరిణామ మేమన-

ఏనుగు, ఏనుఁగు ధర్మములు పోయి అసంబద్ధవర్ణనముతో అసదృశము లవు నన్యధర్మము లా యేనుఁగున కారోపింపఁబడి తుద కవియు నిరసింపఁబడినవి. వాని ఆలోచన మాత్రము ఇంకను సాగుచునేయున్నది. ద్వారస్థవస్తు వేదియో నిరూపితము కాలేదు.

భ్రమరన్యాయము :

తేనెటీఁగ పూవు నంటియున్న ముండ్లను వదలి దానిలోని మకరందమే పానముచేయును.

(బుద్ధిమంతుఁడు దుర్గుణములను వదలి సుగుణములనే గ్రహించును.)

తేనెటీఁగ మకరందపానమునకై ప్రతిపూవుదగ్గఱకుఁ బోవును. కాని సువాసన, మరకందము లేనిపూవుల దగ్గఱకు పోనేపోదు.

(మతిమంతులు గుణవంతులసాంగత్యమే చేయుదురుగాని గుణహీనులు, అప్రయోజకులు నవువారి మొగమేనియుఁ జూడరు.)