పుట:SamskrutaNayamulu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
335

సంస్కృతన్యాయములు

మిధిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి దించన

ము న్నొకపుడు శుకుడు జనకరాజు విదేహనామమున జీవన్ముక్తి సంపాదించినవాడనియు, బ్రహ్మజ్ఞాని యనియు, క్జర్మనిష్టుడై ఆత్మజ్ఞానియనియు, తండ్రివలన నెఱింగి జనకునిపాలికిం జని ఆయనతో వేదాంతవిచారణ చేయును. కర్మపరుడై ఆత్మజ్ఞాని యగు టెట్లను విషయమున వాదించుచున్న సమయమున భటు డొక డరుదెంచి జనకునితో--రాజా! పట్టణ మొకమూలనుండి తగులబడుచున్నదని విన్నవించుకొనెను. అదివిని రాజు చిఱు నవ్వు నవ్వుచు వికార మిసుమంతయు నొందక యిట్లనెను. "మిధిలాయాం ప్రదీప్తాయాం న మే కించన దహ్యతి--" అలాగా? పోనిమ్ము మిధిలాపట్టణ మంతయు తగులబెట్టినను యీఅగ్ని నామనస్సును తగుల బెట్టగలదా? ఆమాటలు విని శుకు డాయన గంభీరచిత్తత్వమున కెంతయు నచ్చెరువొందెను. బ్రహ్మనిష్టుల మనసు అనంతమై యుండును. వారికి ప్రపంచములో మనసు అనంతమై యుండును. వారికి ప్రపంచములో కావలసిన దద్దియు లేదు. ఎట్టిస్థితి సంభవించినను వారు వికారము నొందరు. కర్మలు చేయుచుందురు; కర్మఫలలిప్తులు మాత్రము కారు.

ముణ్ణిడితశిరోరక్షత్రాన్వేషణం

తల గొరిగించుకొనినపిదప నక్షత్రములను చూచినట్లు. క్షౌర మయిన పిదప నక్షత్రము మంచి దయిన నేమి? కాకున్ననేమి? అపుడు నక్షత్రవిచారణ వ్యర్ధము.