పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

"సుజనులు కావ్యశాస్త్రవినోదమున గాలము గడుపుదురు. మూర్ఖులు నిద్రావ్యసనకలహములతో గడుపుదురు. కావున మీకు వినోదముకొఱకు విచిత్రమయిన చక్కని నీతి శాస్త్రకథలు చెప్పుదును. అందు మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి యను నాలుగు భాగములు గలవు. వానిలో ముందు మిత్రలాభము దెలుపుదును. ఆ భాగమున గాక కూర్మాదులు స్నేహమువలన నెంతయో లాభమొందినవి. వాని కథ కడుంగడు విచిత్రము. వినుడు."

కథాప్రారంభము

మిత్రలాభము

చిత్రగ్రీవు డను కపోతరాజు వృత్తాంతము

పూర్వము గోదావరీతీరమున నొక గొప్ప బూరుగు చెట్టు గలదు. అన్ని దెసలనుండియు వచ్చి పక్షులు రాత్రి యా చెట్టుపై నివసించుచుండెడివి. ఒకనాటి వేకువవేళ లఘుపతనక మను కాకము మేలుకాంచి యమునివలె భయం కరుడై యున్న కిరాతు నొకని జూచి "లేవగానే యనిష్ట దర్శన మైనది. నే డేమి కీడు మూడునో కదా!" యని కలత నొందెను. అంతలో బోయవా డావృక్షముచెంత నూకలు చల్లి, వలపన్ని దాగి యుండెను.