పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతతి యంతయు నశించినవెనుక రాజ్యాధిపత్య మెవరిపై వహింతువు. దయచూపితివేని మేమే నీయాహారమునకై దినమునకొక్క మృగమువంతున బంపగలము." అని విన్నవింపగా సింగము 'సరే' యని యంగీకరించెను. నాటినుండియు నాజంతువులు పంపిన యాహారమే తినుచుండెను.

ఇట్లు కొంతకాలము జరిగినవెనుక నొకనా డొక కుందేటికి వంతు వచ్చెను. అపు డది యిట్లు తలపోసెను. "భయ హేతువు గలిగినపుడు ప్రతిప్రాణియు జీవితాశచేత నుపాయము వెదకును. మరణ మెటులైన దప్పనియప్పుడు సింహమునకేల జడియవలయును?" ఇట్లాలోచించుచు నాకుందేలు నెమ్మదిగా వెడలుచుండెను.

సింగ మాకలికి దాళలేక యాకుందేలు కనబడగానే కోపముతో "నీవేల యింత యాలస్యము చేసితివి?" అని యడిగెను. "దానికి స్వామీ! కరుణింపుము. నేను బయలు దేఱి వేగముగా వచ్చుచుండ దారిలో నన్నొక సింహము పట్టుకొని తినబోయెను. 'తప్పక తిరిగి రాగల' నని శపథముచేసి యాసింహమును నమ్మించి వచ్చుసరి కింతయాలస్యమయినది." అని కుందేలు బదు లీయగా సింహము కనుల నిప్పులు రాలునట్లు చూచి మిక్కిలి కోపమున "రమ్ము శీఘ్రముగా నాసింహ మెచ్చటనున్నదో చూపుము. నారాజ్యమునం దింకొక సింహము ప్రవేశించి నాయాహారము నరికట్టుటయా?" యని గర్జించెను.