పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గల్పింపవలయును. కార్యభంగము వాటిల్లినపు డెవని బుద్ధి చలింపకయుండునో వాడే యాపద గడచి గట్టెక్కగలడు." అని దమనకుడు చెప్పెను.

"ఎట్టి బుద్ధిమంతున కైన నొక్కొక్కమాఱు పొరపాటు కలుగుచుండును. అందులకై విచారింప నక్కఱలేదు. కాని గాఢముగ హృదయములందు నాటుకొనియున్న పింగళక సంజీవకుల స్నేహమునకు విఘాతము గలిగించుట శక్యమా?" యని కరటకుడు సందేహముతో బ్రశ్నింపగా దమనకు డిట్లు చెప్పెను.

ఉపాయ మున్నచో సాధింపరాని కార్య మేదియు నుండదు. కాబట్టి చక్కని యుపాయ మాలోచింపవలసి యున్నది. పూర్వమొక వాయస ముపాయముచేత శత్రువయిన కృష్ణసర్పముం జంపెను. నీ కా కథ తెలుపుదును. వినుము.

ఉపాయముచే ద్రాచుబామును జంపిన కాకి కథ

పూర్వకాలమున నొక మఱ్ఱిచెట్టు మీద గూడు కట్టుకొని వాయసదంపతులు నివసించుచుండెను. ఆ చెట్టు తొఱ్ఱలో నొక కృష్ణసర్పముండి యా కాకి పిల్లలను దినివేయు చుండెను. అందులకు గాకము మిక్కిలి దు:ఖించెను. మరల బ్రసవసమయము రాగా నాడుకాకి ప్రియుని జూచి "నాథా ఈ వృక్షమును విడిచి మఱియొక చోటి కేగుదుము. ఇందలి