పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూచి యాచమనము చేయుటకై యా సన్న్యాసి యందు దిగెను. ఆసమయమున నా చెఱువుగట్టుమీద రెండు పొట్టేళ్లు భయంకరముగా డీకొని పోరాడుచుండెను. తలలు పగిలి కారిన రక్తము గాలికి గడ్డకట్టి వాని నడుమ మాంసఖండము వలె నేలమీద గనబడుచుండెను.

ఒకనక్క యదిచూచి మాంస ఖండమే యనుకొని జిహ్వాచాపల్యమున దానిం దినదలచి దగ్గఱి కేగెను. ఇంతలో నంతకుముందు డీకొని మరల డీకొనుటకై వెనుకకు దూరముగా బోయిన పొట్టేళ్ళు మహావేగముగా ముందునకు వచ్చి డీకొనగా నడుమనున్న యానక్క వాని తాకుడునకు నలిగి వెంటనే చచ్చిపోయెను.

చెఱువులలో నాచమనము చేసిన సన్న్యాసి యదిచూచి 'మాంసమందలి యాశయేకదా నక్కకు బ్రాణాంతకమయ్యె' నని తలచుచు గట్టెక్కి శిష్యుని గానక గట్టిగా బిలిచెను. అడవి యంతయు నిటునటు వెదకి చూచెను. ఎచటను వాని జాడ గానరాలేదు. తుద కాతడు తన్ను వంచించి ధనముతో నిండిన బొంత హరించినాడని నిశ్చయించుకొని మిగుల దు:ఖించెను.

కావున స్వయంకృతదోష మనుభవింపకతప్పదు" అని పలికి కొంతసే పాలోచించి "పింగళకసంజీవకులకు జెలిమి యెట్లు గావించితిమో యట్లే వా రిరువురకు మిత్రభేదము