పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేడుకొనగా గరటకుడు "భయపడకుము. సింహము మేఘ గర్జనలకు తిరిగి గర్జించునుగాని నక్క కూతలు లెక్క సేయదు. వాయువు సమున్నతములైన వృక్షములనే పెల్లగించునుగాని వంగియుండు తృణముల జోలికి బోడు. నీవును వినయ విధేయతలతో మెలగిన మారాజు పింగళకుడు నీ కేహానియు జేయడు సరిగదా! నీకేదైన నుద్యోగము కూడ నొసగి గౌరవించును." అని పలికెను.

ఈవిధముగా సంజీవకుని లోబఱచుకొని కూడ దీసికొని పోయి యాతని గొంతదూరమున నుంచి కరటక దమనకులు పింగళకుని సమీపమునకు బోయిరి. రాజునకు వందన మొనరించి కూరుచున్న యనంతరము "దమనకా! నీవు పోయినపని యేమైనది? శబ్దకారణ మెఱిగి యావైరియెవ్వడో తెలిసికొంటివా?" యని పింగళకుడు ప్రశ్నించెను.

దమనకుడు "దేవా! అంతయు మనవిచేయు చున్నాను. మీ రూహించి నటు లాతడు మహాజంతువే కాని క్షుద్రజంతువుకాడు. అయినను దమకు విధేయుడై వర్తింప దలచినవాడు కాని విరోధమునకు బూనుకొను వాడుగాడు. స్వామి యనుగ్రహమున్నచో నుద్యోగిగా నుండి సేవచేయ గలడు. ఆజ్ఞ యైనచో రప్పించెదను." అని విన్నవించెను. పింగళకు డందుల కంగీకరించెను. దమనకుడు బయటికివచ్చి సంజీవకుని రాజు నెదుటికి గొనిపోయెను.