పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. ఆసింహము పట్టుకొన బోగా నది దొరకక కలుగులోనికి బాఱిపోవుచుండెను.

అపుడు దుర్దాంతుడు క్షుద్రశత్రువును బలముచే సాధించుట కష్టము. అట్టివానిం జంపుటకు వానికి దగినవాడే యుండవలయును." అని యాలోంచి యొక గ్రామమునకు బోయి కడుశ్రమతో దధికర్ణు డనెడి మార్జాలమును నమ్మించి తీసికొనివచ్చి గుహలో దనయొద్ద నుంచుకొని యాహారాదులచే దానిం బోషించుచుండెను. దాని భయము వలన మూషికము కలుగువెడలి వచ్చుటకే భయపడు చుండెను. అందువలన గేసరములు కొఱుకుబాధ తప్పి యా సింహము సుఖముగా నిదురించుచుండెను. ఎలుక చప్పుడు వినవచ్చి నపుడెల్ల బిల్లికి దుర్దాంతుడు మాంసాహార మొసగి ప్రోత్సహించుచుండెను.

పిమ్మట గొంతకాలమైన తరువాత నాకలికి దాళలేక యాయెలుక కలుగు వెడలివచ్చి పిల్లిచే భక్షింపబడెను. అనంతరము చాలకాలమువఱకు నెలుక చప్పుడుగాని యెలుక గాని దుర్దాంతునకు గనబడలేదు. ఆ కారణమున దుర్దాంతుడు దధికర్ణున కాహార మిడుటయం దశ్రద్ధవహించుచు గొంతకాలమునకు బూర్తిగా మానివైచెను. దధికర్ణుడును దిండిలేక క్రమముగా బలహీనుడై కృశించి మరణించెను. కాబట్టి యెన్నడును బ్రభువును నిరపేక్షునిగా జేయరాదు."