పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందే తేలిపోవును. నే జీవించియుండగా దమకు భయమక్కఱలేదు. కరటకుడు మున్నగువారి గూడ గొంచెము చేర దీయుడు. ఏలయన, నాపత్సమయములందు బురుష సాహాయ్య మెంతయు నవసరము." అని చెప్పెను.

పిమ్మట గరటకుని గూడ బిలిపించి పింగళకుడు వారిర్వురను సర్వవిధముల గౌరవించెను. అపుడు దమనకు డిట్లనెను. "ప్రభూ! ధ్వని విన్నంతమాత్రామున భయపడరాదు. ధైర్యము వహించి కారణము దెలిసికొని ప్రతిక్రియ యాలోచింపవలయును. ఈయర్థము దెలుపు కథ యొక్కటి గలదు. వివరించెదను; జిత్తగింపుడు.

పొలికలని యందలి నక్క కథ

పూర్వమొక నక్క యాకలిగొని వనమం దాహారమునకై తిరుగాడుచు విసువొంది యదృష్టమువలన దుద కొకయుద్ధ భూమిం గాంచెను. అందు గుప్పలుగా గూలినరధములు, నవయవములు, పలురకములుగా ఖండితములై పడియున్న యేనుగులు, గుఱ్ఱములు, సైనికసమూహములు నిండుగా నుండెను. ఆనక్క యవియన్నియు జూచి సంతసముతో వాని దినుటకై దగ్గఱికి బోవుచుండగా నేదో యొక పెద్దచప్పుడు వినబడెను. ఆధ్వనితో గుండె లదరి యది పాఱిపోవ దలచెను. కానియంతలో నేమి దోచినదో యాధ్వని విన వచ్చిన దెసకు బరికించి చూచెను. దూరమున నొకచోటబడియున్న