పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసినచో జూడామణి పాదములందును గాలియందె తలయందును దాల్చి నట్లగును. బంగరు నగలయందు దాపింపవలసిన మణి యిత్తడియందు బొదిగినయెడల నారత్నమున కేమియు లోటురాదు. భృత్యులకు దగిన గౌరవమొసగని దోసము రాజుదే యగునుగాని భృత్యులది గాదు.

అశ్వము, ఆయధము, శాస్త్రము, వీణ, విద్య, నరుడు, నారియు నుత్తములప్రాపుచే గణన కెక్కుటయు నధముల సాంగత్యమున జెడుటయు లోకప్రసిద్ధములు, అసమర్థున కెంతభక్తి యున్నను, శక్తిమంతు డపకారియైనను నుపయోగ మేమి? రాజావమానమొందిన పరిజనునకు మతిసెడును. వానిం జూచి బుద్ధిమంతు డెవ్వడు రాజసమీపమున కేగుటకు వెఱచును. పండితులు వీడినరాజ్యమున నీతి సెడును. నీతి చెడినపుడు సకలము జెడిపోవును. రాజుగౌరవ మొందిన వాని నందఱు గౌరవించెదరు. రా జనాదరించినట్లు తెలిసిన జనులందఱు నవమానింతురు. ఉచితమైన దానిని బాలుడు తెలిసినను గ్రహింపదగును. రవిలేని సమయమున జిఱుదీప ముపయోగింపకుండునా?" యని దమనకుడు పలుకుచుండ బింగళకు డిటు లనియెను.

"దమనకా! ఇంతగా జెప్పనేల? నీవు మాకు బరమాప్తుడవు. కడు యోగ్యుడవు. ఇంతకాల మేదో దుష్టుల బోధవలన రాకపోకలు తగ్గించితిని. ఇపుడు స్వేచ్ఛగా నీవు చెప్పదలచిన ముఖ్యాంశములు చెప్పుము." అను రాజు