పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుముఖుని చిహ్నములు. మఱియు గాలయాపనము, నాశలు రేకెత్తించుట, ఫల మొసగకుండుట, విముఖుని లక్షణములు. బుద్ధిమంతు డీసంగతులన్నియు గుర్తింపవలయు. ఇన్ని విధములు నెఱిగి పింగళకుని స్వాధీనుని జేసికొందును.

అన విని కరటకుడు "అయినను సమయోచితము గాని ప్రాస్తావము జేయకుము. బృహస్పతితో సమాను డైనను సమయోచితములు గాని పలుకులచేత నవమానము నొందును. అనిపలుకగా దమనకుడు "మిత్రుడా! కరటకకుడా! భయపడకుము. సమయ మెఱుగక మాటలాడను. ఆపదయందును నపమార్గముల బోవునపుడును నడుగకున్నను భృత్యుడు స్వామిహితమును గోరి సంభాషింపవలయును. అవసరమయినపుడు కూడ "మనకేల" యని యాలోచనము సెప్పకయూర కుండు నెడల సేవకుని యునికియే నిరుపయోగము. కాబట్టి సఖుడా! నాకు బోవుటకు సెలవిమ్ము" అని కోరెను. కరటకుడును "శుభమగుగాక. నీదారి సుగమ మగుగాక! నీకు యుక్తమని తోచిన విధమున జాగరూకుడవై ప్రవర్తింపుము. పోయిరమ్ము." అని దమనకుని బంపెను.


దమనకుడు పింగళకుం జేరుట

అనంతరము దమనకుడు వచ్చుచుండుట దూరము నుండియే చూచి పింగళకుడు దగ్గఱకు బిలిపించుకొనెను. దమనకుడును సాష్టాంగనమస్కారముచేసి కూరుచుండెను.