పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుక్క తనకు దిండిపెట్టువాని జేరి తోకాడించును. చరణములు చాచి నేలపై బడి కడుపు, నోరుజూపును. ఇన్నిపాట్లు పడినను దాని కొకటి రెండు ముద్దలకంటె నెవ్వరు నెక్కువ పెట్టరు. ఏనుగు గంభీరముగా జూచుచు మంచి మాటలచే బతిమాలించుకొనుచు నాహారము గైకొనును. పౌరుష జ్ఞానకీర్తులచే బ్రసిద్ధి నొందినవాని బ్రదుకే బ్రదుకు. ఎంగిలి మెదుకు లేఱికొని తిను కాకి కేమి గౌరవముండును? మంచి చెడ్డ లెఱుగక యందఱిచే నిందింపబడుచు నుదరపూరణమే ముఖ్యముగా దలచువాడు పశువుకన్న నధముడు."

ఈవిధముగా దమనకు డిచ్చిన యుపన్యాసము విని కరటకుడు "మనము ప్రధానులము గానపు డింతియాలోచనము మనకేల?" యన దమనకు డిట్లు జవాబిచ్చెను.

"ప్రధానులగుట కెంతకాలము గావలయును! తాము గావించు కృత్యములే జనులను గౌరవనీయులగు ప్రధానులుగాను, ఖలులుగాను జేయుచున్నవి. మానవులకు గౌరవగౌరవములు వారి ప్రవర్తనముం బట్టియే కలుగుచుండును. ఖ్యాతి గాంచుట కష్టము. నిందపడుట తేలిక. బండరాయి కొండ మీది కెక్కించుట మహాకష్టము. కొండమీదినుండి క్రిందికి ద్రోచివైచుట కడు సులభము. నూయి ద్రవ్వువాడు చుట్టు బ్రాకార మేర్పఱచుకొనుచు దన చర్యచేతనే క్రమముగా గ్రిందికి దిగిపోవునట్లు మానవుడు తన కృత్యములచేతనే యధస్థ్సితిం జెందును.