పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోయి దానిం జావమోదెను. ఆదెబ్బ లాయువుపట్టున దాకి వెంటనే యది మరణించెను. కావున "బరుల యధికారము మనకేల?" యని పలికితిని. చచ్చిన పసరముల వెదకి కొనుటయే మనపని. మనకు గావలసినంత తిండి దొరకును. పోవుదము రమ్ము." అని కరటకుడు చెప్పినదంతయు విని దమనకు డిటు లనియెను.

"ఏమీ! తిండికొరకే కేవలము రాజును సేవింప వలయుననియా నీ యుద్దేశము? నీవు చెప్పినది మిక్కిలి యనుచితము. మిత్రులకు మేలును, విరోధులకు హానియు జేయదలచి బుద్ధిమంతులు రాజు నాశ్రయింప గోరుచుందురు. ఏదోవిధమున బొట్ట నింపుకొనలేకపోవుదుమా? విప్రులకు, బంధుమిత్రాదులకు నుపకారము చేయగల జీవితమే ధన్యమైనది. తనపొట్ట నిండించుకొనుటకు మాత్రమే యత్నించుచుండువాని జీవితము నొక జీవితమే యగునా? కాకి కడుపు నింపుకొనుచు నెంతకాలము జీవించిన నేమి ప్రయోజనము.

మాంసములేని వట్టి యెముక దొరకి నంతమాత్రము ననే కుక్క మిక్కిలి సంతుష్టినొదును. జంబుకములుమున్నగు జంతువులు వేలకొలదియు జెంత దిరుగులాడుచున్నను సింహము వానిదెస గన్నెత్తి చూడక యేనుగుల కుంభస్థలములు చీల్చి మెదడు భక్షించుటకై యత్నించుచుండును. ఎవ్వరైన దమ సామర్థ్యమునకు దగిన ఫలమునే కోరుదురు.