పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొమ్ము, మాటాడకుము, చెప్పుము" అని సేవకులను రాజులు బాధించుచుందురు. పణ్యస్త్రీలవలె మూర్ఖులు ధనలాభము కొఱకు మాటిమాటికి దమ యాత్మను సంస్కరించి సంస్కరించి పరుల కుపకరణము గావింతురు. సహజముగా జంచలము, దగని విషయములపై బ్రసరించు నదియు నగు యజమానుల దృష్టిని సేవకులు కడుంగడు గౌరవించుచుందురు.

ఔన్నత్యముం గోరి యడగి యుండవలయును. జీవనముంగోరి ప్రాణములు విడచుట కైనను సిద్ధపడవలయును. సుఖముంగోరి దు:ఖము దెచ్చి పెట్టుకొనవలయును. ఇట్టివిధమున సేవకుడు కాగోరు మూఢు డెవ్వ డుండును" అని పలుకగా విని దమనకు డిట్లనెను.

"మిత్రుడా! అట్లనుట యుచితముగాదు. సంతుష్టినొంది సకలమనోరథములు దీర్పగల ప్రభువులను సేవించుటలో దప్పేమియు లేదు. రాజులకు శ్వేతచ్ఛత్రము, హస్తి తురగాది సైన్యము, చామర వీజనాది సంపదలు ప్రజాసేవను బట్టియేకదా లభించుచుండును?" అన, విని మరల గరటకుడిట్లనెను.

"ఏమయినను నది మనపనిగాదు. సంబంధము లేనిపనికి సిద్ధపడినవాడు మేకు నూడబెఱికిన కోతివలె మృతినొందుట నిజము. నీకా కథ చెప్పెదను, వినుము.