పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని సుఖముగా నా యడవి నేలుకొనుచుండెను. ఆసింహ మానాడు దప్పిగొని పానీయములు ద్రావుటకై యమునానదికి బోవుచు సంజీవక మొనరించిన యకాల మేఘ గర్జనమువంటి యఱపువిని భయపడి పానీయములు గ్రోలకయే వెనుకకు మరలి తనతావునకు బోయి "ఇది యేమై యుండు" నని యాలోచించుచు విన్న బోయి యుండెను.

ఆవనములోనే నివసించుచున్న కరటక దమనకము లనెడి రెండు జంబుకములు పింగళకుడు నీరు ద్రావబోయి భయపడిన విధము గమనించినవి. అందులో దమనకుడు కరటకుని జూచి "సఖుడా! మన రాజైన పింగళకుడు దప్పిగొనియు జలములు గ్రోలక వెనుదిరిగి పోయి వెఱపుతో నుండెను. కారణ మేమియై యుండును? విషయము కనుగొని యాతని భయము మాన్పి యాతని యాశ్రయము సంపాదింప వీలు పడునేమో?" అనగా గరటకుడు "మన మాతని సేవించుట లేనపు డాతని చేష్టలు విమర్శించుట మన కనవసరము. మఱియు నీరాజు, పూర్వ మీతని సేవలు చేయునపుడు నిరపరాధులమగు మనల నవమానించి యున్నాడు. జీవనార్థియై పరులను సేవించుటలో ననుభవించు శీతవాతాతపక్లేశములో నాల్గవపాలు సహించి, తప మొనరించి సుఖము పడయ వచ్చును. ఎవరి జీవనము పరుల కధీనమై యుండదో వారి జన్మము సఫలము. పరాధీనులై జీవించుటకంటె మరణించుటమేలు. "లెమ్ము, రమ్ము