పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మను గ్రామమునుండి బలిష్ఠమైన యెద్దును గొని తెప్పించి దానిని బండికి గట్టించుకొని సంజీవకము నచ్చట దిగవిడచి ముందునకు సాగిపోయెను.

సంజీవకము దైవవశమున గ్రూరజంతువుల బారిబడక యచటి పచ్చిక దిని, సమీపమందలి వాగులోని నీరుద్రావి క్రమక్రమముగా గాలినొప్పి తగ్గి విఱిగినకాలు తిన్నబడి యిటునటుం దిరుగులాడ జొచ్చెను. ఆయువు గట్టిగా నున్నయెడల సముద్రమున మునిగినను, బర్వతము మీది నుండి పడినను, మహాసర్పముకాటు దిన్నను బ్రాణములు పోవు. కాలము రానంతవఱకు బాణశతములచే గొట్టినను చావు గలుగదు. కాలము సమీపించినపుడు దర్భముల్లు తాకినంత మాత్రముననే ప్రాణము లెగిరిపోవును. దిక్కులేక యడవియందు విడువబడిన వాడైనను నెట్లో జీవించును. దైవము సాయపడనిచో నింటియందు సకలోపచారములు నుండియు మరణించును.

కొంతకాల మైన పిమ్మట సంజీవకము స్వేచ్ఛగా విహరించుచు బలిసిన శరీరము గలది యయ్యెను. ఒక్కనా డుత్సాహాతిశయమున గుహలు ప్రతిధ్వనించునట్లు మిక్కిలి గట్టిగా ఱంకె వైచెను.

ఆవనమున బింగళకుడను నొక సింహము కలదు. అది తనబలముచేత నచటి జంతువు లన్నిటిని లోబఱచు