పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధన ముండియు సరిగా గాపాడకున్నచో నది నశించి పోవును. లభించినధనము వృద్ధినొందింపని యెడల గొంచెముగా ఖర్చుపెట్టుచున్నను గాటుకవలె హరించిపోవును. ధనముండియు ననుభవమునకు రానిచో నది నిరుపయోగము దానభోగముల కుపయోగింపని ధనమును, శత్రువిజయము సంపాదింపలేని బలమును, ధర్మమాచరింపని వాని పాండిత్యమును, నింద్రియజయములేనివాని బుద్ధివిశేషమును నిరుపయోగములు.

జల బిందువులను సేకరించుటవలన ఘటము పూరింపబడునటులు సకలవిద్యలు, ధర్మము, ధనము క్షణక్షణము గణము కణముచొప్పున సంపాదింపవలయును. దానోపభోగములు లేక రోజులు వెళ్ళబుచ్చువాడు చర్మముతో జేయబడిన కొలిమితిత్తివలె శ్వాసగలిగియున్నను జీవములేనివాడే.

అట్టిధనము సంపాదించు మార్గములలో వాణిజ్యమే యుత్తమ మయినది. అవసరమయిన యెడల దూరదేశముల కేగియైన వాణిజ్యము చేయవలయును. ఆలస్యము, స్త్రీసేవ, రోగము, జన్మభూమి విడువకుండుట, యల్పసంతుష్టి, భయము నను నవి యభివృద్ధికి బ్రతిబంధకములు." ఈవిధముగ నాలోచించి వర్ధమానుడు వాణిజ్య మొనరించి విశేషధనము సంపాదింప నిశ్చయించుకొనెను.

ఒక మంచిముహూర్తమున నందక సంజీవకము లనెడి రెండెద్దులను గట్టించి వర్ధమానుడు బండి సిద్ధము చేయించెను.