పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దెగగొఱుకుదును. అపు డాతడు నీటిలో బ్రవేశించును. బోయ మిమ్ము సమీపించు సరికి వేగముగా బాఱిపొండు" అని చెప్పగా నవి రెండును నట్లే కావించెను.

కిరాతు డలసినవాడై పానీయముల ద్రావి యామడుగుదరి నున్న చెట్టునీడ యందు గూరుచుండి యాహరిణముంగాంచి సంతసమంది దాని దరికేగెను. హిరణ్యకుం డంతలోవచ్చి మంథరుని బంధములు గొఱికివేయగా నాతడు జలములలో బడెను. బోయ సమీపించుసరికి లేడిలేచి వేగముగా బాఱిపోయెను. ఆవ్యాధు డిదియంతయు జూచి "సిద్ధించిన దానిని విడిచి యెవ్వడు మఱొకదానికై లోభపడునో వాడు తుదకు "రెండింటికి జెడిన రేవ" డగును అని విచారించి నిరాశుడై యింటికి బోయెను. మంథరాధులందఱు నీవిధమున నాపదనుండి తప్పించుకొని సుఖముగా నుండిరి.

రాజపుత్రులారా! మీరును సుజనులగు మిత్రులను సంపాదించి మీరు మేలొంది లోకమునకు మేలుగూర్చుడు" అని విష్ణుశర్మ చెప్పగా వినివారు కడుంగడు మోదమొందిరి.


                      _____________