పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రా దంటిని" అని చెప్పిన భార్యమాటలు విని దేవశర్మ కొంచెము సిగ్గుపడియూరకుండెను.

తరువాత గొన్నిదినములకు యజ్ఞాసేన శుభలక్షణములతో గూడిన కుమారుని గనెను. కొన్నాళ్ళయినపిమ్మట నొకనాడు పర్వదినమగుటచేత నామె కుమారుని బెనిమిటి కప్పగించి నదికి స్నానమునకు బోయెను. ఆమెనది కేగిన వెంటనే యాదేశము నేలు రాజా యగ్రహారమందలి బ్రాహ్మణులను దాన మిచ్చుటకై పిలువనంపెను. బ్రాహ్మణులు కొందఱపుడు దానము గ్రహించుటకై వెళ్ళుచుండిరి.

వారిం జూచి దేవశర్మ యిట్లు చింతించెను. "అయ్యో నేడు నాభార్యను స్నానమున కెందుల కంపితిని? నేను రాజ దర్శనమునకు బోయినచో నిపు డీ శిశువు నెవ్వరు గాపాడుదురు? "రాజు నన్నెపుడు పిలుచును? ఎపుడు దాన మిచ్చును? ఎపుడు భాగ్యవంతుడ నగుదును?" అని చిరకాలమునుండి నిరీక్షించుచుంటిని. ఇపు డవకాశమురాగా వెడలుటకు వీలు లేక పోవుచున్నదే!" ఇట్లు విచారించి యించుకసే పాలోచించి, చాలకాలము నుండి బిడ్డనువలె బెంచిన ముంగిసను బాలునియొద్ద గావలియుంచెదనని నిశ్చయించి దానిని బిలిచి "నీ విచటనుండి యీ శిశువును గనిపెట్టుచుండు" మని సంజ్ఞాపూర్వకముగా దెలిపి, దానిని ద్వారమందు నిలిపి రాజ భవనమునకు బోయెను.