పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వదంతి వినబడుచున్నది. ప్రాత:కాలమున నిక నిట నుండుట మంచిదిగాదు. ఏమిచేయదగునో యాలోచింపుడు."

లేడి మాటలు విని మంథరుడు భయపడి మఱియొక చెఱువునకు బోవుదు మని పలికెను. కాకియు, మృగమును "సరే" యనెను. వారి మాటలు విని హిరణ్యకుడు నవ్వి "మఱియొక జలాశయమునకు బోయినయెడల గుశల మని మంథరుడు చెప్పినది సత్యమే. కాని మెట్టదారి బయనము సేయుట ప్రమాదకరము గాదా? జలజంతువులకు నీరును,దుర్గనివాసులకు దుర్గమును, శ్వాపదాదులకు స్వస్థలమును, రాజునకు సన్మంత్రియు బలము గదా? దూరాలోచనలేని కార్యమునకు బూనుకొన్నయెడల బిమ్మట విచారింపవలసి వచ్చును. ఈ యర్థమును దెలుపు కథ యొకటి గలదు. వినిపించెదను. వినుడు" అని యిటు లా కథ చెప్పదొడగెను.

దూరాలోచన లేక ముంగిసను జంపి విచారించిన బ్రాహ్మణుని కథ

గౌడదేశమునం దొక యగ్రహారమున దేవశర్మ యను బ్రాహ్మణుడు గలడు. అతని భార్య యజ్ఞ సేన. సంతానము లేక లేక కొంతకాలమున కామె గర్భవతి యయ్యెను. దాని కాబ్రాహ్మణుడు మిగుల సంతోషించి కోరిక లీరికలెత్తగా "ఓప్రియురాలా! నీగర్భమునందున్న కుమారుడు మన కులమెల్ల నుద్ధరింపగలడు. మహాభాగ్యవంతుడు కాగలడు."