పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచట నొక మృగమును వేటాడి చంపి దానిని బుజముపై మోచికొని వచ్చుచుండగా నొక యడవిపంది యాతనికి గనబడెను.

ఆతడు బుజము మీది లేడిని క్రిందికి దించి వెల్లెక్కు వెట్టి బాణము సంధించి యా వరాహముం గొట్టెను. అదియు మిక్కిలి కోపముతో ఘర్ఘురధ్వని చేయుచు గొమ్మున వానిం గొట్టగా నాదెబ్బకాతడు మొదలు నఱకిన చెట్టువలె నేలమీద గూలి ప్రాణములు విడిచెను. బాణపు దెబ్బచేత నడవిపందియు మరణించెను. అచ్చట నొక సర్పము కిరాత సూకరముల కాలి త్రొక్కిడికి నలిగి చచ్చెను.

ఇంతలో దీర్ఘరావ మను నొకనక్క యాయడవియందాహారమునకై తిరుగుచు నచటికివచ్చి చచ్చిపడియున్న బోయవానిని, సర్పమును, వరాహమును జూచి యిట్లాలోచించెను.

"నాకిపుడు గొప్పయాహారము దొరకినది. ప్రాణులకు దు:ఖము లేనివిధముగా ననుకొననిదే కలుగుచుండునో దైవశమున సుఖములును నట్లే సంభవించుచుండును. నా కీయాహారము మూడు నెలలవఱకును సరిపడును. ఈ కిరాతునిమాంస మొక నెలకు జాలును. లేడిమాంసముతో నింకొక నెలయు బంది మాంసముతో మఱియొకమాసమును గడుపవచ్చును. సర్పమాంస మొక్కరోజునకు జాలును. ఈవింటినారి నరము దిని మొదటియాకలి దీర్చుకొందునుగాక" యని తలచి