పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోభ మెంతపాడుగుణము? దానివలన మతి చలించును. దాన దు:ఖము గలుగును. నే నట్లు మెల మెల్లన దిరుగు చుండగా జూడాకర్ణుడు చూచి యీమాఱు నన్ను గఱ్ఱతో గట్టిగా గొట్టెను.

"ఎవనిమానసమునకు సంతుష్ఠి కలుగదో వానికి సర్వాపదలును సంభవించును. తృప్తిగలవానికి సకల సంపదలు నున్నట్లే యుండును. చెప్పులుదొడిగిన కాళ్ళకు లోకమంతయు జర్మమయముగ దోచును. సంతుష్టుడైన వానికి గలుగు సుఖ మెంతధనమున్నవానికి గలుగనేరదు. తృప్తి గలవానికి సర్వమునొడగూడును? తృష్ణకు వశుడైనవాడు దూర మనుకొనక నూఱుయోజనములైన దిరుగును. సంతుష్టుడు ధనము మోకాలిదగ్గఱికి వచ్చినను లెక్కసేయడు. వనములో ఫలమూలాదులు దిని సెలయేటినీరు ద్రావి తృణ శయ్యపై బరుండి బ్రదుకుట మేలగునుగాని ధనహీనుడై బంధు మిత్రాదుల నడుమ నుండ దగదు." అని యెంచి యాస్థల మంతటితో విడిచి నిర్జనవనముంజేరితిని. పుణ్యవశమున గొంతకాలమున కిట్టి మిత్రుడు లభించెను. నాయదృష్టమువలన జివరికి నీయాశ్రయ మనెడి స్వర్గమే లభించినది. సంసార మనెడి విష వృక్షమునకు గావ్యామృత రస మనుభవించుట, సుజనులతో సాంగత్యముచేయుట యనునవి రెండే రసవంతములయిన ఫలములు." అని హిరణ్యకుడు వివరించిన సంగతులన్నియు వినిమంథరు డిట్లుపలికెను.