పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలవానికి వనమే శరణ్యము. అభిమానవంతుడు మరణమైన నొందును గాని దైన్యము నొందడు. నిప్పు, నీరు చిలుకరించినను వెంటనే వేడిమి గోలుపోవదుగదా! మానవంతుడు పూలగుత్తివలె నందఱి శిరముల మీదనైన నుండవలయును. లేదా అడవిలో మంటియందుబడి నశించిపోవనైన బోవలయును. ఇచటనే యుండి యాచించుకొని బ్రదుకుట కంటె నెందైనబడి చచ్చుట మేలు.

దారిద్ర్యము సర్వాపదలకు మూలము. కల్లలాడుట కంటె మౌనము మేలు. పరసతుల గూడుటకంటె బురుషుడై పుట్టకుండుట మేలు. యాచించి జీవించుటకంటె జావుమేలు. దుష్టవృషభము లుండుటకంటె గోశాల శూన్యమై యుండుట లెస్స. అవినీతురాలైన భార్యకంటె వేశ్య మేలు. అవివేకి పరిపాలనమున నుండుటకంటె వనవాసము మేలు. అధముల జేరుటకంటె మరణమే మేలు.

వెన్నెల చీకటిని హరించును. ముదుసలితనము లావణ్యమును హరించును. హరినామము పాపములను హరించును. యాచన సర్వసుగుణములను హరించివేయును. కావున నే నేల జీవనమునకై యితరులను గాచుకొని యుండవలయును. అట్లుండుటన్న మాఱురూపమున మృత్యువు నొందియుండుటయే>" అని యెంతో యాలోచించియు దిరిగి లోభమునకు లొంగినవాడనై ధనము సంపాదింప దలచి మరల గలుగు నిర్మించుకొంటిని.