పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైన యెలుక కింత పైకెగురు శక్తి యెటులు వచ్చెను? దీని కేదోకారణ ముండితీరును. వెనుక శాండిలీమాతయను నొక బ్రాహ్మణి నువ్వుపప్పునకు మాఱుగా నువ్వు లడిగినందులకేదో కారణ ముండియుండునని యొక బ్రాహ్మణుడు గుర్తించెను. నీకా కథ చెప్పుదును వినుము" అని వీణాకర్ణు డిట్లు చెప్పదొడగెను.

నూవుల బ్రాహ్మణి కథ

పూర్వము నేనొక బ్రాహ్మణుని యింటికి భిక్షకై వెడలి యుంటిని. ఆయింటి బ్రాహ్మణుడు "ఱేపటి దిన మమావాస్య. బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసియున్నది. పదార్థము లేవి సమకూర్చియుంటి" వని భార్య నడిగెను.

"పురుషులు తమ సామర్థ్యముచేత బదార్థములు సంపాదించి యింటికి దేవలయును. అపుడు స్త్రీలు గావలసిన పనులకు వాని నుపయోగింతురు. మీరు తేకుండిన నే నేమి చేయగలను?" అని యామె బదులు పలికెను.

దాని కా బ్రాహ్మణుడు కోపగించి "పదార్థములు సంపాదింప వలయునన్నమాట నిజమేకాని బ్రాహ్మణునకు విస్తారముగా సంపాదింపవలయు ననెడి కోరిక యుండరాదు. అట్లని విధాయక కృత్యముల కత్యవసర మైనవానిని భద్రపఱుపక పోవుట తప్పుకాదా?" యని భార్యను మందలించెను.