పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"మిత్రమా! చక్కగా నాలోచించితిని. దండకారణ్యమున గర్పూరగౌర మను నొక సరస్సు గలదు. చిరమిత్రుడైన మంథరు డనెడి కూర్మరా జందు గలడు. ఇతరులకు ధర్మములు బోధించుట సులభము. ఆచరించుట కష్టము. ఆ తాబేలు కడు ధర్మాత్ముడు. ఆత డాహార మొసగి నన్ను బోషింపగలడు" అని వాయసము బదులుపల్కెను.

అంతట హిరణ్యకుడు "నీవు వెడలిపోయిన తర్వాత నిచటనుండి నేనేమి చేయుదును? "ఏ దేశమున గౌరవము, జీవనోపాయము, చుట్టములు, విద్యాప్రాప్తి లభింపవో యా దేశము విడువవలయు" నని పెద్ద లందురు. మఱియు, అప్పిచ్చువాడు, వైద్యుడు, సంతతము బ్రవహించు నది, వేదపండితుడు లేనిచోట నుండరాదు. కావున నన్నుగూడ నీతో గొనిపొమ్ము." అని కోరెను. లఘుపతనకు డందుల కంగీకరించెను. సంతసముతో విచిత్రమైన కథలు చెప్పుకొనుచు గర్పూరగౌర సరస్సును జేరబోయిరి.

మంథరుడును, వచ్చుచున్న వాయస మూషికములను దూరమునుండియే చూచి తగిన విధమున నాదరించెను. అనంతరము లఘుపతనకుడు మంథరునితో నిట్లు పలికెను. "సఖుడా! యీ మూషికరాజు మిక్కిలి పుణ్యాత్ముడు. దయాపరుడు. ఈతనిపేరు హిరణ్యకుడు. ఈతని సుగుణ విశేషము లాదిశేషుడైనను వర్ణింపజాలడు. ఈతని నీవు