పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శౌర్యము మున్నగునవి యన్నియు నీయందు గలవు. ఇట్టి మిత్రుడు నాకింకెట్లు దొరకును?" అని వివరించెను.

ఆ మాటలు విని హిరణ్యకుడు కలుగు వెడలివచ్చెను. "లఘుపతనకా! నీమాట లమృతమువలె నా కానంద మొసగినవి. మంచిగందపుసారముగాని, చల్లని నీటితుంపరుల జల్లుకాని, కప్పురపుబ్రోవుల పరిమళముగాని యాదరముతో నిండిన సుజనుల సల్లాపమువలె హాయి గలిగింప జాలవు. రహస్యము వెల్లడించుట, యాచన, నిష్టురముగ మాటలాడుట, మనస్థిరత్వము లేకపోవుట, కోపము, నసత్యములాడుట మిత్రుల కుండరాని గుణములు. ఈ దోసములం దేదియు నీయందు లేదు. మాటలవలననే మంచిచెడ్డలు గొంతవఱకు వెల్లడియగు చుండును. కావున నీవు గోరినటులే యగునుగాక" అని పలికి వాయసముతో సఖ్యమొనరించి గౌరవించెను. నాటినుండియు లఘుపతనక హిరణ్యకులు పరస్పరము గుశల మరసికొనుచు గడు విశ్వాసముతో మాటలాడుకొనుచు గాలక్షేపము సేయు చుండిరి.

ఒకనాడు లఘుపతనకుడు హిరణ్యకునితో "సఖుడా! ఇచట నాకు దిండి దొరకుట కష్టమగుచున్నది. ఇచ్చోటు వీడి మఱియొకస్థలమున కేగుట మంచిదని తలంచుచుంటిని." అని చెప్పెను. దానికి హిరణ్యకుడు "మిత్రుడా! ఒకస్థానము విడిచి నూతనస్థలమున నడుగిడునపుడు చక్కగా నాలోచింపవలయును. నీవెచటి కేగ దలచితివి?" అని అడిగెను.