పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎదుట మంచిమాటలాడి నమ్మించి చాటున గీ డొనరించు మిత్రుని నమ్మరాదు. అట్టివాడు మేకవన్నె పులివంటివాడు." అని పలికి "ఓ దుష్టజంబుకమా! పరమసాధువయిన యీజింకను వంచించితివా? ఓ భూమాతా! నమ్మి మేలొనరించిన వారిని వంచించు దుష్టుల నెట్లు భరింపగలుగుచుంటివి?

దుర్జనుల సాంగత్యము సకలహానులకు మూలము. నిప్పు తాకినవారిని దహించును. చల్లాఱినను మాలిన్యమును గలిగించును.

దోమ ముందుగా బాదముల మీద వ్రాలును. పిదప వీపుమీది మాంసమును గొఱుకును. చెవిలో మధురముగా నేమియో పలుకును. రంధ్రము జూచుకొని నెమ్మదిగా శరీరమున జేరి కడుంగడు హాని గలిగించును. దుష్టుని వర్తనము నిట్టిదే. మధురముగా మాటలాడినంతమాత్రమున విషముతో నిండిన హృదయముగల దుర్జనుని నమ్మరాదు" అని విచారించుచుండ గఱ్ఱ చేత బట్టుకొని వచ్చుచున్న పొలముకాపు గనబడెను.

వాని జూచి వాయసము "సఖుడా! ఆలసింపరాదు. ఊపిరి బిగబట్టి కడు పుబ్బరించునట్లు చేసి కాళ్లు చాచుకొని చనిపోయినట్లు నటింపుము. నేను కూయగానే లేచి వేగముగా బాఱిపొమ్ము" అనిచెప్పెను.

జింకయు గాకి చెప్పిన విధమున జచ్చినట్లు పడియుండెను. అపుడు పొలముకాపువచ్చి యా జింకను జూచి యది