పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తా మనుభవించు తృప్తి క్షణికమే కదా! అనాయాసముగా దొరకు నే యాకలములతోనైన బొట్టపోసికొనవచ్చును. ఈ పాడుపొట్టకై మహాపాపముచేయుట యెంత తెలివితక్కువ పని?" యని పలికి యా ముసలిగ్రద్దకు సంపూర్ణమగు నమ్మకము గలిగించి దానితో మిక్కిలి స్నేహము జేయుచు నాచెట్టు తొఱ్ఱలోనే నివసించుచుండెను.

ఇట్లు కొన్నిదినములు గడచి గ్రద్దకు నమ్మకము ముదిరిన యనంతరము దీర్ఘకర్ణము చెట్టెక్కి పక్షిపిల్లలను దెచ్చి తొఱ్ఱలో నిడుకొని నిత్యము భక్షింపసాగెను. తమపిల్లలు కనబడక పక్షులు దు:ఖించుచు నిటునటు వెదుక దొడగినవి. ఆ సంగతి తెలిసి పిల్లి తొఱ్ఱను విడిచి పాఱిపోయెను. పక్షులు వెదకివెదకి తొఱ్ఱలోనున్న తమపిల్లల యెముకలు కనుగొని యా జరద్గవమే పిల్లలను దినివైచి యుండునని నిశ్చయించి యన్నియు జేరి తమ ముక్కులతో బొడిచి యా ముసలి గ్రద్దను జంపివైచినవి.

కాబట్టి యాకస్మికముగా వచ్చినవారిని నమ్మరాదని చెప్పితిని? ఈ విధముగా జెప్పిన కాకి పలుకులు విని మిక్కిలి కోపముతో జంబుక మిట్లనెను.

"ఈ లేడిని జూచిన మొదటిరోజున నీవును నూతనుడవే. అట్టి నీకును దీనికిని మైత్రి నిత్యమును వర్ధిల్లుట లేదా? నీ కెదురాడువారు లేక నీకు దోచిన వన్నియు నీతులని పలుకు