పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిరణ్యకుని కలుగు దగ్గర వ్రాలి "ఓహో! హిరణ్యకుడా! కొనియాడ దగినవాడవు. కాబట్టి నీచెలిమిగోరి వచ్చితిని. దయయుంచి నాకోరిక దీర్పుము" అని పలికెను.

హిరణ్యకు డది విని కలుగులోనుండియే "ఓయీ నీ వెవడవు?" అని ప్రశ్నించెను. ఆకాకి "నేను లఘుపతనక మనెడి వాయసమను" అని బదులు పలికెను. హిరణ్యకుడు విడ్డూరముగా నవ్వి "నీతోడనా మైత్రి? సరిపడువారు మైత్రి చేయుట మంచిది. నే నాహారమను నీవు భక్షకుడవు. కావున నీతో స్నేహము నాకు హానికరము. పూర్వ మొకలేడి యొక నక్క చెప్పిన కపటమాటలు నమ్మి యురులలో దగులు కొని యొక కాకముచేత గాపాడబడినది. నీ కా కథ చెప్పెదను, విను" మని యిట్లు చెప్పదొడగెను.

నక్క కపటపు మాటలచే వంచింపబడిన లేడి కథ

మగధ దేశమున జంపావతి యను నడవియొకటి గలదు. అచట జిరకాలమునుండియు నొక లేడియు, నొక కాకమును మిగుల స్నేహముతో నివసించుచుండెను. ఆలేడి చక్కగా బలిసి యడవిలో హాయిగా తిరుగుచుండగా నొక జంబుకము చూచి యిట్లాలోచించెను.

"ఆహా! యీలేడి మిక్కిలి బలిసియున్నది. దీని మాంసము నాకెట్లు లభించును." దీనికి నమ్మకము గలిగించి ప్రయత్నించి చూచెదను." అని తలచి యాజింకను సమీ