పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాఱుచుండును. ఇదికేవల మీతని తప్పుగాదు. ఆపద కలిగినప్పుడు తప్పించుకొను నుపాయ మాలోచింపవలయునే కాని యొకరినొకరు నిందించుకొనుట కాపురుషుల లక్షణము. ఆపదనుండి తప్పింపగల సమర్థుడే బంధు వనదగును గాని వృథా నిందాపరుడు బంధువు కాజాలడు.

ఆపదయందు ధైర్యము, నభివృద్ధి గలిగినపు డోర్పు, సభలయందు మాటనేర్పు, యుద్ధములయందు శౌర్యము, కీర్తియం దభిరుచియు, శాస్త్రశ్రవణమునందు వ్యసనము నను నీ గుణములు మహాత్ములకు స్వభావసిద్ధములు. కాబట్టి ధైర్య మవలంబించి ప్రతిక్రియ యాలోచింపదగును.

మన మందఱము నేకీభవించి వలయెత్తుకొని యెగిరి పోవుదుము. "అల్పులమగు మన కీపని యెట్లు శక్య మగు" నని తలపకుడు. అల్పములగు గడ్డిపరకలు పెనవైచుకొని మదించిన యేనుగును సహితము బంధింప గలుగుచున్నవి. అల్పమైన యూక తొలగింపబడిన సారవంతమగు బియ్యపుగింజ మొలకెత్త జాలదు. మన మందఱము గలిసినచో నీపని కష్టము గాదు." అని తమ ఱేడు పలికిన మాటలు విని యా కపోతములన్నియు వల యెగ దన్నుకొని యాకసమున కెగిరిపోయెను.

అనంతర మాబోయవా డది చూచి "యీపక్షులు గుమిగూడి వల దన్నుకొని పోవుచుండెను. నేలపై వ్రాలగానే పట్టుకొందునుగాక" యని తలంచి వెంట బోవుచుండెను.