పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనంతర మాకాశమున బరివారముతో సంచరించు చున్న చిత్రగ్రీవు డనెడి పావురములరాజు నేలమీద నున్న నూకలు జూచి భ్రమపడుచున్న తన తోడి పావురములతో నిట్లనెను. "నిర్జనమగు నీవనమున నూక లెట్లు వచ్చినవి? మన మీ నూకల కాసపడినచో బూర్వము కంకణమునకై యాసించి పులిచేత జిక్కి మరణించిన బాటసారివలె నపాయము నొందవచ్చును. మీ కాకథ చెప్పెదను వినుడు.

కంకణమున కాసించి పులిచే జంపబడిన బాటసారి కథ

పూర్వ మొకపుడు దక్షిణదేశపు టడివిలో దిరుగుచు జూచితిని. ఒక ముసలిపులి స్నానముచేసి దర్భలు చేత బట్టుకొని యొక చెఱువుగట్టున నుండి "ఓయి బాటసారీ! ఇదిగో బంగరు కంకణము. దీనిని దీసికొనుము" అని పలుకుచుండెను.

పేరాసకు లొంగిన యొక బాటసారి "నిస్సందేహముగా నిది నాయదృష్టము. అనుమానములు పెట్టుకొని కూరుచున్నచో ధనార్జనమే కష్టము. అయినను ద్వరపడరాదు. పరిశీలించెదను గాక" యని తలచి "కంకణ మేది? చూపుము" అని యాపులి నడిగెను.

"ఇదిగో బంగరు కంకణము. చూడుము." అని పులి చేయి చాచి చూపెను.

"నీవు క్రూరజంతువవు. నిన్నేలాగున నమ్మవచ్చును?" అని యాబాటసారి ప్రశ్నించెను.