పుట:Sakalaneetisammatamu.pdf/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరోదభేదంబులును, రాజపుత్రజ్ఞాతిబంధుజనపరిపాలనంబును, బౌరాంగనా విట విటీజనలక్షణంబును, సజ్జన దుర్జన వర్తనంబులును, లుబ్ధత్యాగి యాచక గుణవిశేషంబులును, పంచగుప్త ప్రశంసయు, సకలలోకోక్తివిశేషంబులును, నింగితాకారచేష్టలును, సంగీతనాట్యప్రకారంబులును, నన్యాపదేశంబులును, ధనాధనవాణిజ్య కృషీవల పశుపాలన లక్షణంబులును, దేవాలయోద్యాన తులసీవన తటాకాది ప్రతిష్ఠాఫలంబులును, హరిహరభక్తివిశేషంబులును, సాలగ్రామ పూజాఫలంబులును, గాయత్రీమంత్ర గురు పితృభక్తివిధంబులును, నానాతీర్థవిశేషంబులును, మాఘస్నానఫలంబు, ను నివి యాదిగాఁగలిగి బహుకవీంద్రవాక్యామృతపూరంబై, ధర్మార్థకామమోక్షప్రదం బగు నీతిప్రపంచంబు వివరించెద. 17

చ. మును కవులెల్లఁ జెప్పినవి మున్కొని చర్వితచర్వణంబుగాఁ
బనివడి వ్రాయనేల కవిప్రాజ్ఞూలు చిత్తములందుఁ జూడుఁ డా
ఘనుఁడగు ప్రౌఢమూలకరి కమ్మని పువ్వులు గూర్చి దండ గ
ట్టినక్రియ నీతిదామము ఘటింపుదు మీరలు మెచ్చునట్లుగన్. 18

క. సురతాణిముద్రఁ బోలెను
ధర నెల్లెడఁ జెల్లు పెక్కుతార్కాణలతో
సరివచ్చి సర్వసమ్మ
త్త్యరహము గావలయుఁ దజ్ఞుఁ డాడినమాటల్. 19

మదీయముక. జను లిది యల్పగ్రంథం
బనవలదు దీనఁ దోఁచు నన్నియుఁ బెక్కుల్
గనుపట్టఁ జేయు వాతా
యనవివరము పిన్నగాదె యారసి చూడన్. 20

క. భువి నధికుఁడు దెలుపని యు
క్తివిశేషము చిఱుతవాఁడు దెలుపెడు నొకచో
రవికి మఱుఁగైనగొందిని
దివియ ప్రకాశింపఁ జేయదే యొక్కొక్కచోన్. 21

ఉ. ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందుఁ దృణాగ్నలగ్న నీ
రాకృతి వార్థి యింకుట దశాస్యునిఁ జంపుట మిథ్య గాదె వా
ల్మీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్. 22

నీతిభూషణముక. అమల మగు సప్తసంతా
నములం దనిశంబు యశమునకుఁ గుదురై నా
శము లేక నెగడు సత్కా
వ్యము ధారుణిలోన నౌభళార్యుని కందా. 23