పుట:Sakalaneetisammatamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

“ఇది శ్రీ నరసింహప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజసగోత్రాయ్యలార్యపుత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతంబైన సకలనీతిసమ్మతంబను 'ప్రబంధంబు' నందు...... ప్రథమాశ్వాసము” అని వ్రాయుట వలన సింగనదృష్టిలో నిది ప్రబంధమే.

3. సంకలనగ్రంథములు

సింగన యిట్లు స్పష్టముగా ప్రబంధమని నిర్దేశించినను, ఇది సంకలనగ్రంథమే. సంకలనగ్రంథ మనగా కవి, తనకు పూర్వమందున్న కవుల కావ్యములనుండి వర్ణనాంశములుగాని శాస్త్రవిషయములుగాని సేకరించి, వానిని వర్గీకరించి, ఏకాకారమైన యొకకృతిగా సమకూర్చు సాహిత్యప్రక్రియ. సింగన తనకుముం దిట్టిగ్రంథరచన లేకపోవుటచేత, తాను సమకూర్పబోవు కృతి నిట్లు, బహుమనోహరముగా సమర్థించియున్నాడు—

సీ.

“ఆలోలకల్లోలమగు దుగ్ధనిధిఁ ద్రచ్చి
             దేవామృతము తేటఁ దేర్చుపగిది
గంధకారుడు మున్ను గల వస్తువులు జోకఁ
             గూర్చి సుగంధంబు గూడినట్లు
అడవిపువ్వులతేనె లన్నియు మధుపాళి
             యిట్టలంబుగ జున్ను వెట్టుభంగిఁ
దననేర్పు మెఱసి వర్తకుఁడు ముత్తెములీడు
             గూర్చి హారంబు తా గ్రుచ్చుకరణి


గీ.

గృతులు మును సెప్పినట్టి సత్కృతులు ద్రవ్వి
కాంచుకంటెను నొకచోట గానఁబడఁగ
సకలనయశాస్త్రమతములు సంగ్రహించి
గ్రంథ మొనరింతు లోకోపకారముగను."

14

ఇ ట్లొకప్రణాళిక నిర్ణయించుకొని సింగన, తనకు పూర్వపుకృతుల నుండి పద్యములను సేకరించినాడు. కాని పద్యములన్నియు నితరకవులవే గదా. అందువలన వానిని వర్గీకరణము చేసి, వాని నొకదానితో నొకటి యనుసంధించునట్లు, తిరిగి యీ రీతిని చెప్పినాడు.