పుట:Sakalaneetisammatamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. అభియాతి రిపుమీఁద నరిగి యచ్చోసమ
స్థలమైన యెడ శుచిబలము మెఱసి
అధికసంకీర్ణంబు నతివిస్తృతము గాక
రవిసోమవీథుల రమ్య మగుచుఁ
జతురశ్రమై వాస్తుసమ్మతంబై పరి
ఖాంకమై యట్టళ్ళ నమరి నాల్గు
ధరణీతలంబుగా ద్వారముల్ నాలుగు
బాగుగా నిర్మించి లాగుఁ జూచి
ఆ. యడర నర్ధచంద్రునాకృతి నొండేని
నొండె దీర్ఘమొండె మండలంబు
నైనయదిగ వెలయనధిపతి దనవీడు
విడియఁజేసి తనకు వెరవుతోడ. 868

వ. అట్టిశిబిరస్థలంబులు నవభాగంబులు గావించి యందు మధ్యభాగంబు తొమ్మిదిభాగంబులు గావించి తన్మధ్యభాగంబు వాస్తుపురుషహృదయంబు గావున నచ్చోటు పరిహరించి యం దుత్తరభాగంబున. 869

క. మానుగ జనపతి మధ్య
స్థానంబున రాజగృహముఁ దగఁ జేసి వెసన్
దా నర్థగృహం బం దొగిఁ
బూని రచియింపగవలయు బుద్ధిప్రౌఢిన్. 970

క. మౌలభృతశ్రేణిసుహృ
జ్జాలాహితవన్యసైన్యషట్కము నవనీ
పాలునగృహంబు చుట్టును
బోలన్ విడియింపవలయు భూపతి వారిన్. 871

చ. తిరుగక పంతమున్ మెఱసి తేఁకున పంతము గొన్న శూరులున్
బరుసనికుక్కలుం గలుగుబంట్లను బన్నయెడం బ్రతీతిగాఁ
దిరిగిన యట్టివారల నతిస్థిరచిత్తుల లోభదూరులన్
బరగఁగ నిల్పఁబోలు నరపాలుఁడు వేలముచుట్టు నుండగన్. 872

క. పేరుగల కుంజరంబులు
వారువములు భూమిపతినివాసము పొంతన్
వారక నిజాప్తరక్షో
దారములై యుండవలయుఁ దమతమ యెడలన్. 873

క. అంతర్వాసికసేన ని
రంతరసన్నాహమున సదాయతగతి భూ
కాంతుఁ బరిరక్ష సేయుచు
సంతతమును వలయు జాముజామున నిలువన్. 874

ఆ. సంగరైకయోధసన్నద్ధగజమును
వాయువేగి యైనవారువమును
నుండవలయు నెపుడు నుర్వీశుమందిర
ద్వారభూమిఁ గడు నుదారశక్తి. 875

ఆ. కొంతసేన గూడుకొని సైన్యపతి రాత్రిఁ
గడుప్రయత్నపూర్వకంబు గాఁగ