పుట:Sakalaneetisammatamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. రిపుభూమి విచారింపక
చపలుండై దూర మరుగుజనపతి రిపుదో
ర్విపులకరవాలధారా
సుపదస్థుం డగు నయత్నసుఖసాధ్యుండై. 846

క. అమితక్షయవ్యయాయా
సము లొదవెడు నట్టియాత్ర సన దొనరింపన్
గ్రమమున రథవాహనధన
సముచితధాన్యములు వ్యయము చాలను నగుటన్. 847

వ. మఱియును. 848

సీ. గ్రీష్మకాలమున నభోష్మశాంత్యర్థమై
యమితజలాధ్వనుం డరుగవలయు
నీరాడకుండిన భూరితాపంబునఁ
గుంజరంబులమేనఁ గుష్ఠమొదవు
స్వస్థానమందును సామజంబులమేనఁ
బ్రబలోష్మ మెప్పుడుఁ బ్రజ్వలించు
నాయాస మొదవినయపు డుష్ణసుఖదమై
నీరు లేకుండిన నేలఁగూలు
ఆ. నీరుద్రావకున్న వారణముల కుష్ణ
తీవ్రవేదనమున దృష్టి సెడును
నితర జంతువులకు నెంతయు దురవస్థ
వొదవకున్నె నీటి పొందులేక. 849

చ. కరివరపంఙ్తికిన్ జలదకాలమ యెప్పుడు నొప్పుఁ దా శుభం
కరమయి మేఘహీన మగుకాలము ఘోటహితంబు గావునన్
అరయగనీతవర్ష నిబిడాతపశీతము గాక సస్యసుం
దరమగు నట్టికాలము మనఃప్రియదం బగు దండయాత్రకున్. 850

కామందకము



ఆ. పరుల గెలువ నేఁగు నరపతియొద్దన
దనము బలము దగిన ధాన్యములును
గలుగు టొప్పుఁగాక కైకొన కెడనెడ
నునిచి సేన నిలిచియుండఁగలదె. 851

నీతిసారము



ఉ. కొన్నిదినంబు లిక్కడ నకుంఠితలీలఁ బథశ్రమార్తియై
యున్నబలంబు గెల్చికొను టొప్పగు నంతియ కాదు శత్రుభూ
మి న్నిజమార్గ మారయక మిన్నక యేఁగుట యేది బుద్ధి యా
యున్నెడఁ జూచి వెళ్ళుజను లున్నర చెప్పుఁడు గూఢచారతన్. 852

ముద్రామాత్యము