పుట:Sakalaneetisammatamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. దూరమున నున్న రిపులం
జేరంగా వేగ మరుగఁ జేరినమొనలం
బొరఁ బతి వలసెనేనియు
వీరాధిష్టితతురంగవితతి ఘటిల్లున్. 824

క. దురమున ఘోటకనికరం
బరుదుగ వాహ్యాళిఁ బ్రీతి యలరించుచు మం
దిరముల లక్ష్మీకరములు
హరులకు నేభంగి నొండుయానము లెనయే. 825

పురుషార్థసారము



క. పూజించి తన్నుఁ బ్రోచిన
రాజుం దా నొచ్చి యైన రణరంగజయ
భ్రాజిష్ణుఁ జేయునుత్తమ
వాజి గరం బరుదు లక్షవారణములకున్. 826

కామందకము



క. నాలుగుకాళ్ళును గొనయును
వాలము వదనము విశాలవక్షము దెలుపై
నే లైన యష్టమంగళ
నేలినపతి యేలు నవని యేలెడుపతులన్. 827

శాలిహోత్రము



చ. స్ఫుటపరికల్పితంబు నరిసూదనసంయుగదృష్టమార్గముం
బటుతరదంతఘాత మతిబంధురవీరతమాధిరూఢమున్
గటతటవిభ్రమద్భ్రమరగానసముత్సుక మైన యేనుఁ గొ
క్కటియ వధించు నాజి నరకల్పితషష్టిశతాశ్వయూధమున్. 828

కామందకము



ఆ. పరులు గ్రువ్వినపుడు భటు లెందఱైనను
గదియ లేరు వివిధఘాతములకు
సైప నోపుఁగాన సామజంబులకంటెఁ
గలదె విజయమూలకారణంబు. 829

క. తనరూపము రిపుభయదము
తనయంగము లాయుధములు తనవిక్రమసం
జనితమ విజయము తనయుని
కిని సిరియునికియ యనంగ గిరి కరికెనయే. 830

ఉ. యానము సౌఖ్యకారి యధికారికి రక్ష బలంబు శాత్రవ
స్థానవిరోధినిర్భరత సంఘవిభేదనదార్ఢ్య మొప్పన
న్యూనరయాపహారి మదయోగము నభ్యుదయప్రదంబయౌ
నేనుఁగుబోలెనే విజయహేతువు రాజులకొండు గల్గునే. 831

క. కూరిమి గలిగిన జీతం
బారగ నిచ్చునది గాని హస్త్యశ్వములన్
నేరనివానికి నెక్క న
కారణమున నీగి బుద్ధి గా దధిపతికిన్. 832

అజ్ఞాతము