పుట:Sakalaneetisammatamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. పరవిద్యాచ్ఛేదకులై
యురుసురపతిమంత్రతంత్రహోమక్రియలన్
బరబలసంక్షోభరణా
కరు లగు మాంత్రికులు పతికిఁ గలుగఁగవలయున్. 795

క. ప్రతికూలవేళ లెఱుఁగుచుఁ
బతినృపరాశ్యాదు లెఱిఁగి పతిరాశిఫల
జ్ఞత యొఱు లెరుంగకుండఁగ
సతతము రక్షింపవలయు సాంవత్సరికుల్. 796

పురుషార్థసారము



ఆ. మఱి యుదాత్తజనులు మహితవ్యసను లైన
నధికశక్తియుక్తుఁ డైన పతియు
నెత్తి చన నశక్తుఁ డెన్నివిధంబులఁ
బక్షవికల మైన పక్షివోలె. 797

క. అపజయముకంటెఁ గష్టము
నుపమింపఁగ జయముకంటె నొప్పును వసుధా
ధిపులకు లే దట్లగుటన్
గపటోపాయమునైనఁ గార్యము వలయున్. 798

క. గాంగేయు ద్రోణు రాధే
యుం గపటంబునన్ గెల్చుయును బాండవు లు
ర్విం గడు నుతి కెక్కిరి
రణరంగజయం బఖిలదోషరాశిం గడుగున్. 799

కామందకము



ఆ. ఆత్మరక్షణార్థ మరుల జయించిన
పాప మొంద దది శుభాకరంబు
కాన కోప ముడిఁగి కడుఁ దమ కింపక
గూఢబుద్ధి జయము గొనగవలయు. 800

ముద్రామాత్యము



క. తా నెంత శూరుఁ డయ్యు న
నూనపరాక్రముని నొక్కయూఁకునఁ జెఱుపం
గా నేరవలయు వాఁడున్
దానును దలపడియేని తానో వాఁడో. 801

క. ఒఱవపనఁ దనయాజ్ఞకు లోఁ
బఱచుట తగుఁగాక నధికబలవంతులకున్
మఱువైన దేశముల్ తెగఁ
జెఱచుట పగతురకుఁ దెరువు సేయుట గాదే. 802

క. గడి నున్న సదృశబలుతో
నొడఁబడియుండునదిగాని యోపక వానిన్
గడునధికుఁ దెచ్చి చెఱిచిన
చెడుఁ దానుం బొరుగునింటఁ జిచ్చిడిన క్రియన్. 803

క. ఇమ్ముగ దవ్వులచుట్టము
నమ్మి సమీపస్థుఁ బగగొనంజన దటుపా
ర్శ్వమ్మున ఫణి గఱచిన దూ
రమ్మునవేఁజెట్లు దీర్పారా వేర్చువడిన్. 804