పుట:Sakalaneetisammatamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుశలావృతంబు నకుంఠితక్రియయును
నీరాజితతురంగవారణంబు
అన్యోన్యమిత్రతాధన్యప్రచారంబు
సమయసముత్సాహసంగతంబు
గీ. అమితదీర్ఘప్రవాసనిరంతరప్ర
యాసదుఃఖకృతశ్రమభాసురంబు
నవ్విధంబును క్షత్రియోదగ్రసుభట
బహులమును నివి దండసంపద్గుణములు. 770

కామందకము



క. అభిమతనయశాస్త్రస్థ
ప్రభుమంత్రోత్సాహశక్తిపరుఁడై ధాత్రీ
విభుఁ డరివరుల జయించుచు
నభయమ్మున నేలవలయు నఖిలావనియున్. 771

పురుషార్థసారము



క. దవ్వులనె యుండి శాత్రవు
లెవ్వనితేజమున కులుక రెక్కాలము వాఁ
డివ్వసుధ తల్లి యొప్పెడి
జవ్వన మది సెఱుచుకొఱకు జనియించు టగున్. 772

ఆ. శత్రుశోణితమున శాత్రవకామినీ
చారునయనబాష్పసలిలములను
నవనిఁ దడపఁడేని యారాజులావును
జీవనంబు వేఱ చెప్పనేల. 773

బద్దెననీతి



క. ప్రవిమలవిక్రమపరుఁ డగు
నవనీశ్వరు నంకతలమునందు రిపు శ్రీ
దవిలి కుటుంబిని పోలిక
నవిరళమై యుంటు నెపుడు నంచిత మహిమన్. 774

మ. తగ వేపట్టును లేక దుర్వ్యసనియై ధర్మక్రియాహీనుఁడై
తగువారుం బ్రజలున్ విరాగు లగుచేఁత ల్సేయు భూపాలుపైఁ
దగ దండెత్తిన రాజు గెల్చు నరికిన్ దా దండయై నిల్వఁగాఁ
దగు రా జచ్చట లేక యున్నఁదగు దద్రాజ్యంబునున్ జేకొనన్. 775

క. అనురాగము సద్వృత్తుఁడు
ఘనశక్తిత్రయము దైవికముఁ బౌరుషమున్
ధనమును దన కబ్బిన పతి
ననునది యివి లేని యట్టి జనపాలుపయిన్. 776

నీతిభూషణము



క. ప్రెగడల మనసులు విరసము
లగుగతి నడచురిపురాజ్య మడఁచి విశీర్ణం
బుగఁ దాఁ గలంచి పైకొని
జగతీవర కొనఁగవలయు సౌకర్యమునన్. 777

ఆ. కుడువ నిచ్చుతరియు గురువర కేడించు
నవసరం బెఱింగి యానృపాలు
నిలుపుధీరవృత్తి నిడుదాట బోనిమ్ము
గ్రమ్ముకటులసగ్మ గ్రమ్మిచెఱుపు. 778

ధృతరాష్ట్రనీతి