పుట:Sakalaneetisammatamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. ఆతురమున కైన యాతఁడె చుట్టంబు
నరసి ప్రోవఁజాలు నతఁడు తండ్రి
అరయ నమ్మ మెలఁగు నతఁడె మిత్రుఁడు తన
మదికిఁ బ్రియము సేయు నదియె తల్లి. 745

క. ఆపదలు వచ్చి పొందిన
నోపికమైఁ బరఁగు మిత్రుఁ డొక్కఁడె తక్కన్
బ్రా పగుదు రున్నవారను
నీపలుకు వినంగఁ జెవుల కింపిద మగునే. 746

క. పరిపూర్ణుఁ డయ్యుఁ బురుషుఁడు
పరమసుహృత్తులన యాసపడవలయు మదిన్
బరిపూర్ణుఁ డయ్యు నంబుధి
పరగఁగ శశిపొడుపు నాసపడఁడే యెపుడున్. 747

ఆ. ఎవ్వఁడైన నొక్క యెడరు పుట్టినయప్పు
డైనవాఁడె మిత్రుఁ డరసిచూడ
నేచియున్న యప్పు డెవ్వారు నేటికి
శత్రుఁ డైన నపుడు మిత్రుఁ డగును. 748

ఆ. అధికశోక మొదవి యానంద మైనను
నిష్టజనునిఁ జూచు నెప్పు డెవ్వఁ
డతని కెల్ల దుఃఖ మది క్రొత్తయేకాని
మాననేర దెట్టివారి కైన. 749

ఆ. అర్థి నేలికకును నఱలేని సఖునకు
వలయు నంగనకును వరభటునకుఁ
జెప్పవలయు మఱుగు సేయక యెట్లైన
మాను నెట్టి దుఃఖ మైనఁ బిదప. 750

పంచతంత్రి



క. కానలు దరికొను పావకుఁ
డైన ప్రభంజనుఁడు మిత్రుఁ డల్పతదీపం
బైన శిఖి నార్చుఁ గావున
హీనుం డగువాని కెందు నెక్కడి మిత్రుల్. 751

నీతిభూషణము



క. చెలిచుట్టంబు లడంగిన
నొలసినతఱి బుద్ధిమంతుఁ డొకమార్గమునన్
దొలఁగింపకున్న నాతఁడు
బలుపాపము నొందు మనువు పలు కిది మొదలన్. 752

క. పని వడియ తానె వచ్చినఁ
గనుకొని పెడమొగము వెట్టు కష్టుని గేహం
బునకు మఱి పోవు మర్త్యుం
డెనయఁగ శృంగములు లేని యె ద్దనఁగఁదగున్. 753

క. గొనమొండె దోసమొండెను
నొనరం గని రెంటియందు నొక్కఁడు సేయన్
గనఁజాలని నరునింటికిఁ
జనుగంటెను నొండురోఁత జగమునఁ గలదే. 754