మించినపలుకు గ్రహించుటకై సర్వ
జనులవాక్యంబులు వినఁగవలయు
నేచి మదోద్వృత్తి నేదియు నెఱుఁగక
చేయంగఁ దగుపనుల్ చేయునపుడు
ఆ. మంత్రజనుల మీఱి మంత్రరహితుఁడైన
యతని నొక్కపెట్ట యహితవరులు
చిక్కువడఁగ నడఁచి సిరియును రాజ్యంబు
నలమికొండ్రు బుద్ధిబలము కలిమి. 699
ఆ. హితము నడఁపుచును నహితుల నడఁపక
పొదల విడుచు టేమి బుద్ధి దలఁప
గోరఁ డిదుమవచ్చుకొనయైన ముదిసినఁ
బరశుధారఁ గాక పాపఁదరమె. 700
నీతిసారము
క. పని యైనమీఁదనేనియుఁ
దను నన్యు లెఱుగకుండఁ దాన విచారం
బునఁ గొనఁగవలయుఁ గార్యము
వినుతనిగూఢక్రియావివేకస్ఫురణన్. 701
ముద్రామాత్యము
గీ. మంత్రు లాత్మప్రయోజనమహితబుద్ధి
దీర్ఘనిగ్రహ మొనరింపఁ దెలియలేక
కళవళించినయేని రా జలవు దఱిగి
పొసఁగు మంత్రులపాటికి భోగ్యుఁ డగుచు. 702
మ. నయశాస్త్రజ్ఞులు శుద్ధకర్ములును సన్మార్గప్రవృత్తాత్ములున్
జయశీలాఢ్యులునైన పూర్వులమహోసన్మార్గము న్మాని దు
ర్జయుఁడై మంత్రవినిర్ణయం బెఱుఁగ కున్మాదించి పైఁబడ్డ దు
ర్జయవిద్విట్ధరఖడ్గధారకు వెస న్గ్రాసంబు గాకుండనే. 703
ఆ. నీతిపథముఁ దప్పి నెఱి వేగపడి చేయు
నతఁడు దుఃఖఫలంబు ననుభవించు
క్రిందుమీఁ దెఱింగి కృతకార్యుఁ డగువాఁడు
సేయుకార్యమెల్ల సిద్ధిఁ బొందు. 704
వ. అజ్ఞాతవిజ్ఞానంబును నిశ్చయంబు నర్థద్వైధసందేహవిచ్ఛేదంబును నశేషదర్శనంబును నన మంత్రంబును నాలుగురూపంబులై యుండుఁ దత్ప్రకారం బెట్టిదనిన. 705