క. పానమదాంధుఁడై పనిఁ
బూని మదింపంగఁ జేయు పొం దెఱుఁగఁ డొగిన్
గానఁ బతి పానసంగతి
మానంగావలయు విజితమానసుఁ డగుచున్. 683
కామందకము
వ. ఇట్లీకామవ్యసనచతుష్కంబునందలి తారతమ్యం బెట్టి దనిన. 684
క. స్త్రీపానంబులకంటెను
భూపతిఁ జెఱుపంగ జూదమును వేఁటయుఁ దా
నోపు లఘుమాత్రమేనియుఁ
బై పడి సేవించెనేని పండితుఁ డైనన్. 685
ఆ. మాత్రతోడఁ బనమానినీవ్యసనముల్
జరుపు టొప్పు నెన్ని చందములను
నింతయైన చేఁత యెగ్గగుఁ గావున
వేఁటజూదములను విడువవలయు. 686
క. ఈసప్తవ్యసనములకు
నోసరిలుట లెస్స విడువనోపఁడయైనన్
వ్యాసక్తి వలదు వేఁటయు
నాసవపానమును నింద్య మని రాపతికిన్. 687
మదీయము
మంత్రరక్షణార్థములు
ఉ. రాజితమంత్రబీజము ధరావలయేశ్వరు రాజ్యలక్ష్మికిన్
బీజము గాన మంత్ర మవనీపతి రక్ష యొనర్చు టొప్పు నా
యోజ ఘటింపఁడేని నతఁ డొక్కట నాశముఁ బొందు నట్టిని
భ్రాజితమంత్రరక్షఁ దగురా జనపాయసుఖంబు గైకొనున్. 688
అజ్ఞాతము
క. రాజులకు విజయమూలము
రాజితతంత్రంబు సుస్థిరంబుగ దానిన్
రాజాన్వయ రక్షింతె ధ
రాజనులకుఁ గర్ణగోచరము గాకుండన్. 689
ఆ. కార్య మెట్టిదియును గాసియౌ మంత్రంబు
దలఁప నొరులచెవులు సిలికెనేని
కాన నాల్గుసేవుల నూనంగ రక్షింప
వలయు నెఱుక గలుగువారు ధరణి. 690
సభాపర్వము
క. ఆప్తు లెఱింగిన నాప్తుల
యాప్తు లెఱుంగుదురు తత్తదాప్తశ్రవణ
ప్రాప్త మగుచుండుఁ గావున
నాప్తపరంపరల మంత్ర మవియున్ బతికిన్. 691
బద్దెననీతి