ఉ. జూద మనర్థహేతు వగు జూదము మైత్రికి మూలహాని యౌ
జూద మమందచిత్తమున క్షోభము పుట్టు ననాత్మపక్షసం
భేదము పుట్టుఁ గానఁ బతి బేలయి జూద మొనర్చు టొప్ప దా
హ్లాదము నున్మదోద్ధతజనాదరమునన్ బరివర్జ్య మెమ్మెయిన్. 677
సీ. కార్యగతిక్రియాకాలాతిపాతము
పృథులధర్మార్థ సంపీడనంబు
సంతతాభ్యంతరసంపాతవివశుఁడై
కుందుటఁ బ్రకృతిప్రకోపనంబు
యువతిపక్షముచేత నొగి రహస్యవిభేద
మరయఁగ గార్యక్రియాప్రియంబుఁ
దనర నీర్ష్యామర్షజననముఁ గ్రోధంబుఁ
జాలవిరోధంబు సాహసంబు
ఆ. నివియు మొదలు గాఁగ నిన్ని దోషంబులు
ద్యూతమందుఁ గలుగు దోషములును
అంగనావ్యసనమునందు నిన్నియుఁ బుట్టుఁ
గాన యది భజింపఁ గాదు పతికి. 678
గీ. కామినీజనముఖవిలోకనమునందుఁ
దమకపడియెడు నల్పచేతసుల కెపుడు
యౌవనముతోడఁ గూడ సమస్తమైన
యీహితంబులు లయ మంద కేల తక్కు. 679
పానవ్యసనము
సీ. వమనంబు విహ్వలత్వంబు సంజ్ఞానాశ
వర్తనలీల వివస్త్రతయును
బహువిధాబద్ధదుర్భాషావిశేషము
ననితరాకారణహననములను
యుఱక ప్రాణగ్లానియును సుహృన్నాశముఁ
బ్రజ్ఞామతిశ్రుతభ్రాంతి మఱియు
సద్వియోగంబు నసజ్జనయోగంబు
సతతకృతానర్థసంగ్రహంబు
గీ. స్థలనవేపథుతంద్రావికారములును
జిరతరాత్యంతకాంతానిషేవణంబు
లాదిఁగా గల దోషంబు లఖిలసద్వి
నిందితంబులు పానంబునందుఁ గలుగు. 680
క. శ్రుతశీలబలోపేతులు
నతిప్రతాపులును నైన యంధకవృష్ణుల్
అతిపానదోషవశమున
హత మంది యడంగి రనిన నన్యులవశమే. 681
ఆ. యోగిజనవరేణ్యుఁ డున్నతగుణశాలి
భృగుసమానబుద్ధి భృగుసుతుండు
శుక్రుఁ డకట పానశూరుఁడై తనచే టె
ఱుంగలేక కచుని మ్రింగఁ డయ్యె. 682