శ్రీ
సకలనీతిసమ్మతము
తృతీయాశ్వాసము
క. శ్రీశవాణీశరుద్రా
ణీశసురేశాదిసకలదివిజార్చితదో
షాశాపాశరజాది
క్లేశరహితపదసనాథ కేశవనాథా. 643
షాడ్గుణ్యము
క. చన వెఱిఁగి నడయవలయును
వినయోచితవృత్తి సంధివిగ్రహయానా
సనసంశ్రయణద్వైదము
లను షాడ్గుణ్యంబు పతి నిజామాత్యులతోన్. 644
కుమారసంభవము
వ. తత్ప్రకారం బెట్టి దనిన. 645
సీ. తనసమానం డగు ధరణీశుపాలికి
గూఢచారులఁ బంచి కొలఁది యెఱిఁగి
చెలిమి యేర్పడఁగ లేఖలు పుచ్చి
క్రమ్మఱ నతనిలేఖలు విని యాదరించి
పావడంబులు రాయబారులచే నంపి
యతఁడు పుత్తెనిచిన ననుభవించి
..............................................
.............................................
ఆ. తగినబాస చేసి తాను నాతఁడు గని
వేడ్కఁ దాను నతఁడు వియ్య మంది
యతఁడు దనకుఁ దాను నతనికి నై కూడి
సఖ్య మాచరింప సంధి యయ్యె. 646
సీ. పరభూమిరాజు దుర్బలుఁ డైనతఱిఁ
దనమన్నించువారిని జెన్ను మిగుల
బసులుదెచ్చియు గడిపల్లెలు పొడిచియుఁ
జిచ్చులు వైచియుఁ జెఱలు గొనియుఁ
దెరువాటు లడిచియుఁ దెక్కలు దాఁకియు
నూళ్లు గాల్చియు పైరి నొలిచికొనియు
బందులు పట్టియుఁ దొందడి చేసియుఁ
గన్న గాండ్రను బంచి కలిమిగొనియు
గీ. కొలుచుఁ జేలును దోఁటలు కొల్లగొనుచు
బ్రతుకుఁ డని దాను జతురంగబలముతోడఁ
బగఱపైఁ జని దేశంబు పాడుచేసి
వెఱవు పుట్టించుచునికియ విగ్రహంబు. 647